Begin typing your search above and press return to search.

తన లాయర్ డిటైల్స్ చెప్పిన నాగం

By:  Tupaki Desk   |   4 July 2016 4:46 AM GMT
తన లాయర్ డిటైల్స్ చెప్పిన నాగం
X
తమ ప్రత్యర్థులపై విమర్శలు.. ఆరోపణలు సంధించటం నాయకులకు ఉండే బేసిక్ లక్షణం. అయితే.. అన్ని పార్టీల నాయకుల తీరు ఒకలా ఉంటే.. టీఆర్ ఎస్ పార్టీ తీరు అందుకు భిన్నంగా ఉంటుంది. మిగిలిన పార్టీ నేతలు తమ ప్రత్యర్థుల్ని లక్ష్యంగా చేసుకుంటే విమర్శలు.. ఆరోపణలు అంతకు మించి నాలుగు తిట్లు మాత్రమే తిట్టగలుగుతారు.కానీ.. టీఆర్ ఎస్ నేతల అప్రోచ్ కాస్త భిన్నంగా ఉంటుంది. వారు తాము చేసే విమర్శలతో.. ఎదుటి వారు తప్పనిసరిగా స్పందించే తీరులో ప్రశ్నల్ని సంధిస్తారు.

తాము కానీ సమాధానాలు చెప్పకుంటే.. అవతలి పక్షం వారు మరింత చెలరేగిపోతారని.. తమను బద్నాం చేస్తారన్నట్లుగా వ్యవహరిస్తారు. ఇలాంటి వ్యూహంలో జరిగేదేమంటే.. ప్రత్యర్థులపై విరుచుకుపడే కంటే ముందు తమకు తాము డిఫెన్స్ లో పడిపోయి.. టీఆర్ ఎస్ నేతలు సంధించిన అంశాలపై వివరణ ఇచ్చుకోవటంలో సరిపోతుంది. ఇలాంటి పరిస్థితి సీనియర్ నేతలకూ తప్పని పరిస్థితి. తెలంగాణ రాజకీయాల్లో తలపండిన నాగం జనార్దనరెడ్డి వ్యవహారాన్నే తీసుకుంటే.. ఆయన నోరు విప్పితే.. ఎంతటి ప్రత్యర్థి అయినా ఉక్కిరిబిక్కిరి కావాల్సిందే. అలాంటి నాగం సైతం.. టీఆర్ ఎస్ నేతలు మాటలదాడికి ఎదురుదాడి చేయటం మానేసి.. వివరణ ఇచ్చే తీరులో మాట్లాడటం గమనార్హం.

తెలంగాణ ఇరిగేషన్ ప్రాజెక్టు పనుల్ని ఆంధ్రా కాంట్రాక్టర్లు అప్పజెబుతున్నారంటూ చెలరేగిపోయిన ఆయనకు టీఆర్ ఎస్ నేతలు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. తెలంగాణ గురించి ఇన్ని మాటలు మాట్లాడే నాగం.. తన లాయర్ గా ఆంధ్రా ప్రాంతానికి చెందిన వ్యక్తిని పెట్టుకున్నారంటూ టీఆర్ ఎస్ నేతలు చేసిన విమర్శకు నాగం విలవిలలాడిపోతున్నారు. టీఆర్ ఎస్ నేతలు చేసిన ఆరోపణల్లో నిజం లేదని తేల్చి చెప్పేందుకు విపరీతంగా ప్రయాస పడుతున్న ఆయన.. తన లాయర్ తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి అని..నిజామాబాద్ జిల్లాకు చెందిన వాడంటూ నాగం వివరణ ఇస్తున్నారు. నాగం ఇస్తున్న వివరణకు గులాబీ నేతలు సంతృప్తి చెందుతారా? మరిన్ని విమర్శనాస్త్రాల్ని ఎక్కుబెడతారా?