Begin typing your search above and press return to search.

నాగబాబు మళ్లీ సెటైర్లు..ఈసారి దేనిమీదంటే?

By:  Tupaki Desk   |   23 May 2020 11:15 AM IST
నాగబాబు మళ్లీ సెటైర్లు..ఈసారి దేనిమీదంటే?
X
మెగా బ్రదర్ నాగబాబు ఈ నిర్బంధ టైంలో చిచ్చు రాజేస్తున్నారు. వరుస వివాదాస్పద ట్వీట్లతో హాట్ టాపిక్ గా మారుతున్నారు. మొన్నటికి మొన్న జాతిపిత మహాత్మాగాంధీని చంపిన నాథురాం గాడ్సేను నిజమైన దేశభక్తుడిగా కీర్తించి వివాదాన్ని రాజేశారు. ఈ ట్వీట్లపై తీవ్ర వ్యతిరేకత రావడం.. కేసులు కూడా నమోదు కావడంతో వివరణ ఇచ్చుకున్నారు.

గాడ్సేను పొగడడంపై క్లారిటీ ఇచ్చారు. తీవ్ర వ్యతిరేకత రావడంతో నాగబాబు స్పందించాడు.. ‘దయచేసి అందరూ నన్ను అర్థం చేసుకోండి.. నేను నాథూరాం గాడ్సే చేసిన నేరాన్ని సమర్థించలేదని.. గాడ్సే వెర్షన్ కూడా జనానికి తెలియాలని మాత్రమే ట్వీట్ చేశానని.. నాకు మహాత్మాగాంధీ అంటే చాలా గౌరవం..’ అని తన వ్యాఖ్యలను దిద్దుబాటు చేసుకున్నారు.

అంతేకాదు మరో ట్వీట్లో తాను గాడ్సేపై చేసిన వ్యాఖ్యలు నా వ్యక్తిగతమని.. జనసేన పార్టీకి గానీ, మా కుటుంబంలో మరెవరికీ నా అభిప్రాయలతో సంబంధం లేదని’ నాగబాబు వివరణ ఇచ్చాడు.

ఈ వివాదాలన్నీ సమసిపోకముందే మరోసారి వేదాంతం మాట్లాడారు. ‘సత్యం వధ.. ధర్మం చర అంటే నిజం మాట్లాడాలని.. న్యాయంగా జీవించాలని అర్థం.. కానీ ప్రస్తుతం చూస్తుంటే సత్యం వధించబడింది.. ధర్మం చెరసాల పాలైంది ’ అని వ్యంగ్యంగా అన్నారు. ఇదే కరెక్ట్ అనిపిస్తోందని సెటైర్లు వేశారు.

ఇలా ఈ ఖాళీటైంలో నాగబాబు రాజేస్తున్న వివాదాలపై సినీ రాజకీయ ఇండస్ట్రీలో జోరుగా చర్చ జరుగుతోంది. నాగబాబు ట్వీట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. వరుస ట్వీట్లతో నాగబాబు వివాదాలు రాజేస్తున్నారు.