Begin typing your search above and press return to search.

వాళ్లకు జగన్ సరైనోడు: నాగబాబు

By:  Tupaki Desk   |   10 Jun 2020 12:00 PM IST
వాళ్లకు జగన్ సరైనోడు: నాగబాబు
X
ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబుకు.. ఆయనకు అనుకూలంగా బాకా ఊదే మీడియా సంస్థలకు ఏపీ సీఎం జగనే కరెక్ట్ మొగుడని మెగాబ్రదర్ నాగబాబు కామెంట్ చేయడం ఆసక్తికరంగా మారింది. తొలి నుంచి వైసీపీని - జగన్ ను తమ వ్యతిరేకిగా భావించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ - మెగా బ్రదర్ నాగబాబులు విమర్శించడం ప్రజలు చూస్తునే ఉన్నారు. అయితే తాజాగా మెగాబ్రదర్ నాగబాబు సడెన్ గా ఫ్లేటు ఫిరాయించాడు. సీఎం వైఎస్ జగన్ కు అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం అందరిలో ఆసక్తిని రేపుతోంది. ఆయనకు ఎందుకిలా వ్యాఖ్యలు చేశారనే చర్చ రాజకీయ - సినీ ప్రముఖుల్లో మొదలైంది.

మెగాబద్రర్ నాగబాబు ఈ వ్యాఖ్యలకు చేయడానికి అసలు కారణం.. బాబుకు బాకా ఊదే మీడియా సంస్థలే అని తెలుస్తోంది. మంగళవారం ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిసేందుకు చిరంజీవి ఆధ్వర్యంలో పలువురు సినీ పెద్దలు వెళ్లిన సంగతి తెల్సిందే. ఇండస్ట్రీకి మంచి జరగాలని చిరుబృందం సీఎం జగన్ కలిసేందుకు వెళ్లగా బాబు అనుకూల మీడియా సంస్థలు మాత్రం ప్రతికూల కథనాలు ప్రసారాలు చేశాయి. ఓ ఐదుగురు మహిళలు ప్లకార్డులతో అమరావతి రాజధాని పేరిట చేపట్టిన కార్యక్రమానికి వైఎస్ జగన్ -టాలీవుడ్ పెద్దల బేటికీ లింకు పెట్టి కథనాన్ని ప్రసారం చేయడమే నాగబాబుకు కోపం తెప్పించింది. దీంతో నాగబాబు దీనిపై హాట్ కామెంట్స్ చేశారని తెలుస్తోంది. చంద్రాబు ‘కుల’ మీడియాపై తన ట్వీటర్లో నాగబాబు సైటర్లు వేశారు.

‘టీడీపీ జెండాని అజెండా ని మోస్తున్న కొన్ని తెలుగు వార్త చానెల్స్ ని చూస్తుంటే ముచ్చటేస్తుంది.. టీడీపీ పార్టీ ఉప్పు తిన్న విశ్వాసాన్ని - టీడీపీ పట్ల వాళ్లకున్న అనురాగం - మన వాడు చంద్రబాబు నాయుడుగారు అన్న అభిమానం, మన చంద్రబాబు కోసం ఎంతకయినా తెగించే సాహసం, మనబాబు కి ఉపయోగపడినంత కాలం ఓడ మల్లయ్య అని.. బాబోరి తప్పుల్ని ఎత్తి చూపిస్తే బోడి మల్లయ్య అంటూ ప్రతిపక్ష పార్టీ నాయకులను చక్కగా విమర్శిస్తూ.. బాబుగారి ప్రయోజనాలను కాపాడే రక్షణ కవచాలుగా వారు చూపిస్తున్న తెగువ - బాబుగారి కి దగ్గరగా వుండే బాబులను కూడా ముద్దు చేసే వారి మమతానురాగాలు.. వావ్.. ఇది అసలైన వార్తా పత్రికల స్పిరిట్ అంటే’ అంటూ బాబుకు బాకాలుదే మీడియాపై నాగబాబు సైటర్ వేశారు.

గత కొన్నిరోజులుగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న పనులను విమర్శించే నాగబాబు ఒక్కసారిగా ఆయనకు అనుకూలంగా మాట్లాడటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు, కొన్ని ‘కుల’ మీడియాలకు జగన్ కరెక్ట్ అనడంపై వైసీపీ శ్రేణులు - అభిమానులు పెద్దఎత్తున స్వాగతిస్తున్నారు. మరికొందరు విశాఖలో భూములు పంచుతుండటం వల్లే నాగబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఆయన వ్యతిరేక వర్గం ప్రచారానికి తెరలేపింది. దీనిపై నాగబాబు ఏవిధంగా రియాక్టవుతారో వేచి చూడాల్సిందే..!