Begin typing your search above and press return to search.

పవన్ కి నాగబాబు చేసే రాజకీయ సాయం... ?

By:  Tupaki Desk   |   31 Jan 2022 5:00 PM IST
పవన్ కి నాగబాబు చేసే రాజకీయ సాయం... ?
X
మెగా బ్రదర్స్ అంటే త్రిమూర్తులు. అందులో అన్న మెగాస్టార్ టాలీవుడ్ లో శిఖరాయమానమైన కీర్తిని గడించారు. ఆయన రాజకీయాలలో కూడా కేంద్ర మంత్రిగా కొన్నాళ్ళు పనిచేశారు. ఇపుడు చూస్తే పూర్తి స్థాయిలో సినిమాల మీదనే ఆయన దృష్టి పెట్టారు. ఇక ఆయన మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం అయితే లేదు. ఆ విషయాన్ని ఆయన కూడా ఎన్నో సార్లు మీడియా ముఖంగా స్పష్టంగా చెప్పేశారు. ఇక పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ఎనిమిదేళ్ళ క్రితం స్థాపించారు.

ఆయన ఇప్పటికి రెండు ఎన్నికలను చూశారు. ఈసారి అంటే 2024లో జరిగే ఎన్నికలకు బాగానే ప్రిపేర్ అవుతున్నారు. మరి ఆయన పార్టీలో కీలకంగా ఉంటూ నర్సాపురం ఎంపీగా జనసేన తరఫున పోటీ చేసి రెండున్నర లక్షల ఓట్లను తెచ్చుకున్న మెగా బ్రదర్ నాగబాబు వచ్చే ఎన్నికల్లో ఏంచేస్తారు అన్న చర్చ అయితే సాగుతోంది. నాగబాబు అయితే 2019 ఎన్నికల్లో తమ్ముడి వెంటనే ఉండి జనసేన విజయానికి కృషి చేశారు.

అయితే నాడు వైసీపీ వైపు జనం మొగ్గు ఉండడం వల్ల జనసేన అధికారంలోకి రాలేకపోయింది. అయినా సరే ఆరు శాతం ఓట్లను తెచ్చుకుంది. ఇక పవన్ ఎన్నికల్లో ఓడినా కూడా ఎక్కడా నిరాశపడకుండా గడచిన మూడేళ్ళుగా పార్టీని నడిపిస్తూనే ఉన్నారు. ఈ నేపధ్యంలో వచ్చే ఎన్నికల్లో జనసేనకు మెగా ఫ్యామిలీ మద్దతు ఎలా ఉంటుంది. ఎవరెవరు ఆ ఫ్యామిలీ నుంచి రంగంలోకి వస్తారు అన్న చర్చ అయితే చాలా కాలంగా సాగుతోంది.

దానికి తాజాగా ఒక టీవీ చానల్ ఇంటర్వ్యూలో మెగా బ్రదర్ నాగబాబు మాట్లాడుతూ తమ ఫ్యామిలీ మద్దతు తమ్ముడికి ఎపుడూ ఉంటుందని కుండబద్ధలు కొట్టారు. వచ్చే ఎన్నికల్లో తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగి పోటీ చేయనని స్పష్టం చేశారు. అయితే తాను ఏపీ వ్యాప్తంగా తిరిగి జనసేన పార్టీ ఏపీలో పవర్ లోకి రావాల్సిన అవసరం గురించి ప్రజలకు వివరిస్తాను అని చెప్పారు. అంతే కాకుండా జనసేన అభ్యర్ధుల విజయానికి నా వంతుగా కృషి చేస్తాన‌ని అని నాగబాబు పేర్కొన్నారు.

అదే విధంగా కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ కూడా నాగబాబు చేశారు. తనకు పదవుల మీద వ్యామోహం లేదని, పోటీ చేసి ఎమ్మెల్యేగానో, ఎంపీగానో అయిపోవాలని అసలు లేదని కూడా చెప్పేశారు. ఏపీకి మంచి పాలన అందించాలన్నది పవన్ ఆశయమని, దాన్ని నెరవేర్చే పనిలో తన వంతుగా తాను ముందుకు వచ్చి పాటుపడతానని అన్నారు. అంతే తప్ప పదవులు ఏవీ కోరుకోనని ఆయన చెప్పేశారు.

ఇక జనసేనలో తాను అతి సాధారణ కార్యకర్తను మాత్రమే అని కూడా నాగబాబు పేర్కొన్నారు. పవన్ అధినేత అని, ఆయనతో పాటు అనుభవం కలిగిన నాయకులు చాలా మంది ఉన్నారని, వారు పార్టీని నడిపిస్తారని, తన పని పవన్ ఏది చెబితే అది చేయడమే అన్నారు. పొత్తుల విషయంలో కూడా పవన్ తీసుకునే నిర్ణయమే శిరోధార్యమని, ప్రస్తుతానికైతే తనకు పొత్తులు ఎవరితో ఉంటాయి అన్నది తెలియదని అన్నారు. బీజేపీ మాత్రమే తమ మిత్రపక్షమని కూడా ఆయన చెప్పుకున్నారు.

మొత్తానికి వచ్చే ఎన్నికల్లో మెగా ఫ్యామిలీ నుంచి ఎవరూ పోటీ చేయబోవడం లేదని నాగబాబు మాటలను బట్టి తెలుస్తోంది. అదే టైమ్ లో స్టార్ కాంపెనియర్ గా తాను దిగి పవన్ కి గట్టి సపొర్ట్ ఇస్తానని నాగబాబు చెప్పడం అంటే నిజంగా జనసైనికులకు ఆనందం కలిగించే విషయం. మరి కేవలం నాగబాబు ఒక్కరేనా ఆ టైమ్ కి మరింతమంది మెగా హీరోలు ప్రచారంలోకి వచ్చి జనసేనకు మద్దతుగా నిలబడతారా అన్నది చూడాలి. ఇక్కడ ఒక్కటి మాత్రం పక్కా క్లారిటీ. అదేంటి అంటే చిరంజీవి ఇక రాజకీయాల్లోకి ఎప్పటికీ రారు, అలాగే మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన అయితే నాగబాబుకు ఏ కోశానా లేదు. మొత్తానికి ఈ ఇద్దరు అన్నలూ కలసి తమ్ముడు పవన్ కి తమ నిండు దీవెనలు తెలియచేస్తున్నారు. అది జనసేనకు కొండంత బలమే కదా.