Begin typing your search above and press return to search.

అరే సాంబ రాసుకోరా.. నాగబాబు సారు మాటను..!

By:  Tupaki Desk   |   31 July 2019 5:28 PM IST
అరే సాంబ రాసుకోరా.. నాగబాబు సారు మాటను..!
X
ప్రశ్నించేందుకే పార్టీ పెట్టినట్లుగా చెప్పుకునే జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తన పంచ్ లాంటి మాటలతో పలువురిని ఆకర్షించారు. తాను అనుకున్నది ఒకటైతే.. జరుగుతున్నది మరొకటి కావటంతో కరెక్షన్ మొదలెట్టినట్లుగా కనిపిస్తోంది. ప్రశ్నించటానికి పార్టీ పెట్టిన మాటతో స్ఫూర్తి పొందుతూ.. ప్రతి ఒక్కరూ పవన్ ను ప్రశ్నించే పరిస్థితికి రావటంతో.. ఇప్పుడు దిద్దుబాటు ప్రక్రియకు తెర తీశారు పవర్ స్టార్ సోదరుడు నాగబాబు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగానే కాదు.. జనసేన పార్టీ మూల సిద్ధాంతాన్నే క్వశ్చన్ చేసేలా ఉండటం గమనార్హం.

తాజాగా రాజమండ్రి పార్లమెంటరీ నేతలు.. కార్యకర్తలతో సమావేశమైన సందర్భంగా మాట్లాడిన నాగబాబు.. పార్టీలో ఇలా చేయండి.. ఈ పని చేయండని తాను పవన్ కు చెప్పనని.. ఏం పని చేయాలో మాత్రమే అడుగుతానని ఆయన వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ నిర్ణయాల్ని తాను ప్రశ్నించనని నాగబాబు వెల్లడించారు. తమ్ముడి మీద ప్రేమతో నాగబాబు ఇలా మాట్లాడి ఉండొచ్చు. అంత మాత్రాన పవన్ చెప్పిన ప్రశ్నించే తత్త్వాన్ని వదులుకుంటే ఎలా? అన్న సందేహం వస్తుందన్న విషయాన్ని గుర్తించారేమో కానీ.. ఈ విషయం మీద కూడా క్లారిటీ ఇచ్చేశారు.

నిజమైన కార్యకర్త ఎప్పుడూ పార్టీ అధినేతను ప్రశ్నించకూడదని చెప్పారు. గుడ్డిగా అనుసరించాలన్నారు. ఎందుకంటే.. మనందరి కంటే ఎక్కువ విజన్ ఉన్న వ్యక్తి పవన్ అంటూ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. పవన్ ఒక నిర్ణయాన్ని తీసుకున్నంతనే నచ్చకపోవచ్చు కానీ.. ఆ నిర్ణయం కారణంగా కలిగే దీర్ఘకాలిక ప్రయోజనం ఏమిటన్నది జనసేనానికి మాత్రమే తెలుస్తుందంటూ తమ్ముడి గొప్పతనాన్ని భలేగా కీర్తించారు. మొత్తానికి.. ప్రశ్నించే గుణం పార్టీలో ఉండకూడదన్న విషయాన్ని నాగబాబు అన్నయ్య ఎంత స్మార్ట్ గా చెప్పారో కదా? అరే.. సాంబ జాగ్రత్తగా రాసుకుంటున్నావుగా.. నాగబాబు అన్నయ్య మాటల్ని.