Begin typing your search above and press return to search.

మెగాస్టార్ పొలిటికల్ రీ ఎంట్రీ...నాగబాబు ఏం చెప్పారంటే....?

By:  Tupaki Desk   |   26 Dec 2022 10:10 PM IST
మెగాస్టార్ పొలిటికల్ రీ ఎంట్రీ...నాగబాబు ఏం చెప్పారంటే....?
X
మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ లో సీనియర్ మోస్ట్ హీరో. ఈ రోజుకు కూడా ఆయన ప్లేస్ అలాగే ఉంది. ఆయన టాలీవుడ్ కి పెద్ద దిక్కుగా ఉన్నారు. తాను తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డను అని చిరంజీవి వినయంగా చెప్పుకోవచ్చు కానీ ఆయన పెద్దరికంతోనే బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారు.

ఇక చిరంజీవి ఫ్లాష్ బ్యాక్ లో రాజకీయంగా కూడా కీలకంగా వ్యవహరించారు. ప్రజారాజ్యం పార్టీని పెట్టి అటు వైఎస్సార్ కి ఇటు చంద్రబాబుకు కి కలవరం పుట్టించారు. ప్రజారాజ్యం పుట్టి కేవలం ఎనిమిది నెలల తేడాతో పార్టీ ఎన్నికలలో పోటీకి దిగితే ఏకంగా డెబ్బై లక్షలకు పైగా ఓట్లు పద్దెనిమిది శాతం ఓట్ల షేర్ ప్రజారాజ్యం దక్కించుకుంది.

ఏకంగా పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీ తరఫున గెలిచారు ఆ తరువాత చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. బదులుగా ఆయన కేంద్ర మంత్రి అయ్యారు. రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేశారు. 2018లో ఆయన రాజ్యసభ సభ్యత్వం పూర్తి అయింది. ఆ తరువాత ఆయన రాజకీయాల గురించి పెద్దగా మాట్లాడడంలేదు.

అయితే అన్ని పార్టీలు మాత్రం ఆయన రాజకీయాల్లో ఉండాలని గట్టిగా కోరుకుంటునాయి. నేను రాజకీయాల నుంచి దూరం అయినా రాజకీయం మాత్రం నా నుంచి దూరం కాలేదు అని చిరంజీవి రీసెంట్ గా గాడ్ ఫాదర్ ఒక డైలాగ్ కూడా కొట్టారు. ఇవన్నీ ఇలా ఉంటే చిరంజీవి రాజకీయంగా మళ్లీ యాక్టివ్ అవుతారా. రీ ఎంట్రీ ఉంటుందా అన్న చర్చ అయితే అలా జరుగుతూనే ఉంటుంది. దానికి ఆయన మెగా బ్రదర్ నాగబాబు ఆసక్తికరమైన వివరణ ఇచ్చారు.

తన అన్నయ్య చిరంజీవి రాజకీయంగా మళ్లీ ఎంట్రీ ఇస్తారన్న నమ్మకం అయితే తనకు లేదని తేల్చేశారు. చిరంజీవి రాజకీయాల కంటే సినిమాల్లోనే ఉంటారు అన్నది నాగబాబు అభిప్రాయం. అదే టైం లో చిరంజీవికి ఏ పదవీ లేకపోయినా కోట్లాదిమంది అభిమానులు ఉన్నారని, ఆయనకు అదే పెద్ద ఆస్తి అని కూడా నాగబాబు చెప్పుకొచ్చారు.

అటువంటి చిరంజీవి మీద ఈగవాలినా మెగాభిమానులు ఎవరూ ఊరుకోరు అని ఆయన అంటున్నారు. మెగా ఫ్యాన్స్ ఎందాకైనా వెళ్తారు అని ఆయన అంటున్నారు. చిరంజీవి వినయంగా ఉంటారని ఎవరైనా రెచ్చగొట్టాలని చూస్తే కనుక ఫ్యాన్స్ తిరగబడడం తధ్యమని నాగబాబు చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా నాగబాబు ఒక విషయం చెప్పారు. చిరంజీవి మీద ఒకపుడు పూలు చల్లి తీసుకెళ్ళిన వ్యక్తి తరువాత కాలంలో నిర్లక్షంగా వ్యవహరించారని చెప్పుకొచ్చారు. మరి ఆ వ్యక్తి ఎవరో ఆయన చెప్పలేదు.

అదలా ఉంచితే చిరంజీవిని ఇపుడు ఎవరు రెచ్చగొడుతున్నారో కూడా నాగబాబు చెప్పలేదు. ఫ్యాన్స్ తిరగబడతారు అని వార్నింగ్ అయితే ఫుల్ గా ఇచ్చేశారు. ఇక చిరంజీవి పొలిటికల్ రీ ఎంట్రీ మీద తనకు నమ్మకం లేదని నాగబాబు చెప్పారంటే అది నిజమే అనుకోవాలి. ఇటీవల గోవాలో జరిగిన అంతర్జాతీయ చిత్రోత్సవంలో కూడా మెగాస్టార్ ఇదే విషయం చెప్పారు. తన ఊపిరి ఉన్నంతవరకూ తాను నటిస్తూనే ఉంటాను అని ఆయన అక్కడే ప్రకటించారు. సో మెగాస్టార్ రాజకీయ రీ ఎంట్రీ లేనట్లే అనుకోవాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.