Begin typing your search above and press return to search.

కేసీఆర్ ను పొగిడేసిన ఏపీ మాజీ సీఎం

By:  Tupaki Desk   |   1 April 2016 4:27 PM GMT
కేసీఆర్ ను పొగిడేసిన ఏపీ మాజీ సీఎం
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు అనుకోని ప్రశంస లభించింది. గురువారం అసెంబ్లీలో తెలంగాణ జల విధానంపై మూడు గంటల పాటు నాన్ స్టాప్ ప్రజంటేషన్ ఇచ్చేసి పలువురు మనసుల్ని దోచుకున్న ముఖ్యమంత్రికి.. సమైక్య రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వ్యవహరించిన వ్యక్తి నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి. కేసీఆర్ తీరును ప్రశంసిస్తూ సదరు మాజీ ముఖ్యమంత్రి ఏకంగా ఒక లేఖ రాయటం విశేషం.

ఇంతకీ ఆ మాజీ ముఖ్యమంత్రి ఎవరో కాదు.. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి.. కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ సాయంతో నెల రోజుల పాటు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన నాదెండ్ల భాస్కర్ రావే. తెలంగాణ రాష్ట్రం నిర్మించాలని భావిస్తున్న సాగునీటి ప్రాజెక్టులపై కేసీఆర్ కు విజన్ ఉందని.. పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా కేసీఆర్ తన నిబద్ధతను చాటుకున్నట్లుగా పేర్కొన్నారు.

ఒకవైపు తెలంగాణ విపక్షాలు తీవ్రస్థాయిలో ముఖ్యమంత్రి ప్రజంటేషన్ ను విమర్శిస్తూ.. పలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఏపీ ప్రాంతానికి చెందిన ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి.. కేసీఆర్ ప్రజంటేషన్ ను పొగిడేయటం చిత్రమే. తాజాగా నాదెండ్ల పొగడ్తలు చూస్తే.. సమైక్య పాలనలో తెలంగాణకు దారుణమైన అన్యాయం జరిగిందని.. వ్యూహాత్మకంగానే తెలంగాణను దెబ్బ తీయటానికి కుట్ర జరిగిందంటూ పలు ఆరోపణలు చేసిన కేసీఆఱ్ మాటలకు నాదెండ్ల ఓకే చెప్పేసినట్లేనా? ఊరికే పొగిడేయటం కాకుండా.. సమైక్య పాలనలో తెలంగాణను అణగదొక్కేందుకు ఆంధ్ర ప్రాంత నాయకులు కుట్ర పన్నారంటూ కేసీఆర్ చేసిన ఆరోపణలకు కూడా నాదెండ్ల సమాధానం చెబితే సమంజసంగా ఉంటుంది.