Begin typing your search above and press return to search.

వ్య‌క్తిగ‌త దాడి.. ప‌వ‌న్ మాత్ర‌మే చేయాలా?!

By:  Tupaki Desk   |   29 Sep 2021 5:30 PM GMT
వ్య‌క్తిగ‌త దాడి.. ప‌వ‌న్ మాత్ర‌మే చేయాలా?!
X
ముఖ్య‌మంత్రిని ప‌ట్టుకుని ఆయ‌న కులం గురించి మాట్లాడ‌తారు.. అది కూడా వ్యంగ్యంగా! ఒక‌సారని కాదు.. మాటి మాటికీ ముఖ్య‌మంత్రి పేరులో కులాన్ని ఒత్తి ప‌లుకుతారు! మీ కులం వారంటారు! ఇంకో మంత్రిని ప‌ట్టుకుని స‌న్నాసి అంటారు! ఇవ‌న్నీ జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట‌ల నుంచి జాలువారిన‌వే!

ఇక ఇప్పుడు జ‌న‌సేన పార్టీకి చెందిన మ‌రో నేత నాదెండ్ల మనోహ‌ర్ మాట్లాడుతూ.. ప‌వ‌న్ క‌ల్యాణ్ పై వ్య‌క్తిగ‌త దాడి చేస్తున్నారంటూ వాపోయారు. ప‌వ‌న్ ను ధైర్యంగా ఎదుర్కొన‌లేక వ్య‌క్తిగ‌త వ్య‌వ‌హారాల గురించి మాట్లాడుతున్నార‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.

నాదెండ్ల మాట‌ల్లో నిజం ఉంద‌నే అనుకుందాం. అయితే.. ఈ ర‌చ్చ‌ను ఎవ‌రు మొద‌లుపెట్టారు? ఎవ‌రు ప‌దే ప‌దే కొన‌సాగిస్తున్నార‌నే అంశం గురించి కాస్త ఆలోచించే వాళ్ల‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ తీరు కూడా గుర్తు రాక మాన‌దు. జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన‌ప్ప‌టి నుంచి ప‌వ‌న్ కుల, మ‌త ప్ర‌స్తావ‌న‌ను తీవ్రంగా చేస్తూ వ‌స్తున్నారు. అవ‌కాశం ఉన్నా లేక‌పోయినా, స‌మ‌యం సంద‌ర్భంతో నిమిత్తం లేకుండా ప‌వ‌న్ క‌ల్యాణ్.. కులం క‌థ‌, మ‌తం క‌థ ఎత్తుతూనే ఉన్నారు!

వాటిని వ‌దిలి విమ‌ర్శ‌లు చేసుకోవ‌చ్చు. విధాన‌ప‌ర‌మైన అంశాల‌ను ప్ర‌స్తావించ‌వ‌చ్చు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను హైలెట్ చేయ‌వ‌చ్చు. అయితే వాటితో ప‌వ‌న్ కు అంత కిక్కు వ‌చ్చేలా లేదు. అందుకే.. డైరెక్టుగా మ‌తం, కులం గురించి మాట్లాడుతూ వ‌స్తున్నారు.

ఇక మంత్రుల విష‌యానికి వ‌స్తే.. గ‌తంలో కూడా ఒక మంత్రిని ప‌వ‌న్ ప‌దే ప‌దే టార్గెట్ చేసుకున్నారు. ప్ర‌జారాజ్యంలో ప‌ని చేసిన కుర‌సాల క‌న్న‌బాబును ప‌వ‌న్ కొంత‌కాలం పాటు టార్గెట్ చేసుకున్నారు. ఆ త‌ర్వాత ఇప్పుడు పేర్నినాని వంతు వ‌చ్చింది. వీరి విష‌యంలో వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల‌కు కూడా ప‌వ‌న్ వెనుకాడం లేదు. మంత్రుల‌ను విమ‌ర్శించ‌వ‌చ్చు. అది కూడా విధాన‌ప‌రంగా ఉంటే అర్థ‌వంతంగా ఉంటుంది. స‌న్నాసులు, చేత‌గాని వారు అన‌డం, ప్ర‌జారాజ్యం నుంచి బ‌య‌ట‌కు వెళ్లిన వారంద‌రూ త‌మ‌కేదో ద్రోహం చేసి వెళ్లిన‌ట్టుగా ప‌వ‌న్ మాట్లాడ‌టం హాస్యాస్ప‌దం. వారి పేర్ల‌ను త‌ను గుర్తుంచుకున్నాను అంటూ కూడా ప‌వ‌న్ గ‌తంలో చెప్పుకొచ్చారు. ప్ర‌జారాజ్యం క‌థ ఎలా ముగిసిందో అంద‌రికీ తెలిసిందే. దాని అధినేతే విలీనం చేసి, చేతులు దులుపుకున్నారు. కానీ ప‌వ‌న్ ఇప్ప‌టికీ ఆ పాత ఉదంతాల్లో కొంద‌రు వ్య‌క్తులు త‌న హిట్ లిస్టులో ఉన్న‌ట్టుగా చెప్పుకుంటూ ఉంటారు. ఇవ‌న్నీ వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు కావా? బ‌హుశా ప‌వ‌న్ కే ఇలాంటి విమ‌ర్శ‌లు చేసే హ‌క్కు, అధికారం ఉంటుందా?