Begin typing your search above and press return to search.

విశ్వం పుట్టుక రహస్యం ఛేదించబోతున్నారట!

By:  Tupaki Desk   |   5 Dec 2021 12:30 AM GMT
విశ్వం పుట్టుక రహస్యం ఛేదించబోతున్నారట!
X
అంతరిక్షంలో ఏం జరిగింది? ఏం జరుగుతోంది? అనే విషయాలను తెలుసుకోవడానికి మానవుడు ఎప్పుడూ తహతహలాడుతుంటాడు. ఇప్పటికే విశ్వం పుట్టుక మీద శాస్త్రవేత్తలు చాలా పరిశోధన జరిపారు. మరిన్ని పరిశోధనలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. అయితే వీటికి సంబంధించి మరొక కీలక ముందడుగు పడింది. అంతరిక్షంలో ఉండే గ్రహాలు, నక్షత్రాలు, ఉపగ్రహాలు లాంటివి ఎలా పుట్టాయి? ఎలా మనుగడ సాగిస్తున్నాయి? వాటిపైన జీవానికి సంబంధించిన ఆనవాళ్లు ఏమైనా ఉన్నాయా? లేవా? లాంటి కీలక అంశాలపై పరిశోధన జరపడానికి నాసా శాస్త్రవేత్తలు ఓ టెలిస్కోపును తయారు చేశారు. దీని ద్వారా విశ్వం పుట్టుకకు సంబంధించి ఎన్నో కీలక విషయాలను బహిర్గతం చేసే దిశగా దీనిని అంతరిక్షంలోకి పంపనున్నారు.

ఇందుకుగాను డిసెంబర్ 18 ముహూర్తంగా నిర్ణయించారు. ఈ టెలిస్కోప్ వాస్తవానికి ఒక టైం మిషన్ లాంటిది. విశ్వం పుట్టిన నాటి నుంచి... ఎలా పరిణామం చెందింది అనే విషయాలను ఈ టెలిస్కోప్ ద్వారా శాస్త్రవేత్తలు తెలుసుకొనున్నారు. ఈ టెలిస్కోప్ అంతరిక్షంలోకి ప్రవేశించిన తరువాత దాని పనిలో భాగంగా అనేక గ్రహాలకు, నక్షత్రాలకు, గెలాక్సీలకు సంబంధించిన ఫోటోలను నాసా శాస్త్రవేత్తలకు పంపనుంది. ఇదేగాని జరిగితే అంతరిక్ష పరిశోధనల్లో మరొక కీలక ఘట్టం ఆవిష్కృతమవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ టెలిస్కోప్ కు జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్‌ అని పేరు పెట్టారు.

ఈ టెలిస్కోపును ఉపయోగించి నాసా శాస్త్రవేత్తలు విశ్వం పుట్టుకకు గల ఆనవాళ్లను తెలుసుకోనున్నారు. అంతేకాకుండా బిగ్ బ్యాంగ్ థియరీ ద్వారా విశ్వం విచ్ఛిన్నమైనప్పుడు వెలువడిన కాంతిని ఈ టెలిస్కోప్ ద్వారా గుర్తించనున్నారు. ఈ అత్యాధునిక టెలిస్కోప్ సాయంతో అంతరిక్షంలో ఎంత దూరంలో అయినా ఉండే కాంతిని స్పష్టంగా చూడవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కొన్ని వేల కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడిన విశ్వంలో తదనానుగుణంగా ఏర్పడిన ఎన్నో పాలపుంతలకు సంబంధించిన సమాచారం ఈ టెలిస్కోప్ ద్వారా నిపుణులు తెలుసుకోనున్నారు.

ఈ టెలిస్కోపును కేవలం ఒక్క అమెరికా మాత్రమే రూపొందించింది అనుకుంటే పొరపాటే. దీనిని పూర్తిస్థాయిలో సిద్ధం చేయడానికి 14 పైగా దేశాలు ఏకతాటిపైకి వచ్చాయి. ఇందుకు అయ్యే ఖర్చును పంచుకొని చివరకు అంతరిక్ష పరిశోధనకు సిద్ధం చేశాయి. సుమారు 12 వందలకు పైగా శాస్త్రవేత్తలు ఈ టెలిస్కోప్ నిర్మాణం లో పాల్గొన్నారు. ఇది భూమికి, సూర్యుడికి మధ్య కూడా ప్రయాణించనుంది. ఆ సమయంలో భానుడు నుంచి వెలుబడే వేడిమిని తట్టుకునేలా దీనిని రూపొందించారు. అంతేకాకుండా ఓవర్ హీట్ తో పాటు... ఓవర్ కోల్డ్ ను కూడా తట్టుకునేలా దీని నిర్మాణం జరిగింది.

ఈ టెలిస్కోపును ఈ ఏడాది డిసెంబర్లోనే మూడోవారంలో అంతరిక్షంలోకి ప్రవేశ పెట్టాలని నాసా శాస్త్రవేత్తలు నిర్ణయించారు ఇందుకుగాను ఫ్రెంచ్ లోని గయాన నుంచి దీనిని అంతరిక్షంలోకి ప్రవేశ పెట్టనున్నారు. అటు పిమ్మట ఇది అక్కడ తీసిన ఛాయాచిత్రాలను భూమికి పంపుతుంది. దీంతో అంతరిక్ష పరిశోధనల్లో శాస్త్రవేత్తలు కృషి ఫలించనుంది.