Begin typing your search above and press return to search.

ఆటోవాలాలకు నల్లకుబేరుల బంపర్ ఆఫర్

By:  Tupaki Desk   |   20 Nov 2016 5:25 AM GMT
ఆటోవాలాలకు నల్లకుబేరుల బంపర్ ఆఫర్
X
కేవలం లక్ష రూపాయిలతో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. తమిళనాడులో చోటు చేసుకున్న ఈ ఘటన అందరిని ఒక్కసారి ఉలిక్కిపడేలా చేసింది. ఇక.. ఆటోవాలాలు అయితే.. ఏ ఇద్దరు కలిసినా.. ఆ అంశం గురించే మాట్లాడుకునే పరిస్థితి. రూ.లక్షతో అంతలా సంచలనం ఏం సృష్టించారన్న విషయంలోకి వెళితే.. శనివారం పొద్దుపొద్దున్నే తమిళనాడులోని తిరునల్వేలిలో ఇద్దరు వ్యక్తులు రెండు పెట్రోల్ బంకులకు వచ్చారు. పాత రూ.500 నోట్ల కట్టను ఒక్కొక్కటి చొప్పున ఈ రెండు పెట్రోల్ బంకులకు ఇచ్చారు.

రూ.50వేల చొప్పున పాతనోట్లను ఇచ్చిన వారు.. ఆటోవాలాలకు ఉచితంగా పెట్రోల్ పోయాలని.. రూ.50వేల మొత్తం అయ్యే వరకూ పోయాలని కోరారు. దీంతో.. పెట్రోల్ బంకు సిబ్బంది సరేనని చెప్పి.. తమ వద్దకు వచ్చిన ఆటోవాలాలకు ఉచితంగా పెట్రోల్ పోయటం మొదలెట్టారు. ఈ విషయం కాసేపటికే ఆటో వాలాలకు తెలిసిపోయింది.

అంతే ఒక్కసారిగా ప్రవాహం మాదిరి రెండు పెట్రోల్ బంకుల వద్దకు ఆటోలు పెద్ద ఎత్తున పోటెత్తాయి. రెండు పెట్రోల్ బంకులకు పొద్దున్నే వచ్చి రూ.లక్ష ఇచ్చిన ఆ డబ్బున్న మా రాజులు ఎవరు? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఈ ప్రశ్నకు సమాధానం దొరకకున్నా.. ఫ్రీగా పెట్రోల్ పోయటంతో ఆటోవాలాల ఆనందం అంతాఇంతా కాదు. ఈ హడావుడి కాస్తా పోలీసుల దృష్టికి వెళ్లింది. వెంటనే వారు రంగంలోకి దిగి.. పెట్రోల్ బంకుల వద్దకు చేరుకొని.. ఆ డబ్బులు ఇచ్చిన వారి వివరాల్ని అడిగితే.. తమకు తెలీదని బంకు సిబ్బంది చెప్పారు. పోలీసులు వచ్చే సమయానికి రూ.లక్షలో రూ.90వేల మొత్తాన్ని ఆటోవాలాలకు పెట్రోల్ కొట్టించినట్లుగా తేలింది. ఇలాంటి తప్పు ఎలా చేస్తారంటూ.. పోలీసులు పెట్రోల్ బంకు సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో.. సిబ్బంది కుయ్యో.. మొర్రో అనే పరిస్థితి. నల్ల కుబేరులు ఎవరో.. తమ దగ్గరున్నడబ్బుల్ని వృధా చేసే కన్నా.. ఆటోవాలాలకు ఎంతోకొంత సాయంగా ఉంటుందన్న ఉద్దేశంతో ఇలా చేసి ఉంటారని పలువురు ఆటోవాలాలు మాట్లాడుకోవటం కనిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/