Begin typing your search above and press return to search.

అయోధ్య తీర్పులో మిస్టరీ.. ఇలాంటిది ఇదే మొదటిసారి?

By:  Tupaki Desk   |   10 Nov 2019 8:06 AM GMT
అయోధ్య తీర్పులో మిస్టరీ.. ఇలాంటిది ఇదే మొదటిసారి?
X
సుదీర్ఘకాలం పాటు సాగిన అయోధ్య వివాదానికి తెర దించుతూ శనివారం సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వటం తెలిసిందే. మొత్తం 1045 పేజీలున్న తీర్పు పాఠంలో ఆసక్తికర అంశాలకు కొదవ లేదని చెబుతున్నారు. అన్నింటికి మించి ఈ కేసు తీర్పు సందర్భంగా చోటు చేసుకున్న కొన్ని పరిణామాలు ఈ కేసును ప్రత్యేకంగా నిలపనున్నాయి.

మొత్తం 1045 పేజీలున్న తీర్పులో 116 పేజీల ప్రత్యేక అనుబంధాన్ని ధర్మాసనం వెలువరించింది. ఈ అనుబంధంలో రామజన్మభూమిపై హిందువుల నమ్మకం.. విశ్వాసాలను ప్రస్తావించటమే ప్రత్యేకతగా చెప్పాలి. అంతేకాదు.. ఈ తీర్పును రాసిన న్యాయమూర్తి ఎవరన్న విషయాన్ని ప్రస్తావించలేదు. సాధారణంగా తీర్పును వెల్లడించే పత్రం మీద.. తీర్పు కాపీ మీద సదరు న్యాయమూర్తి పేరును రాస్తుంటారు.

ఇందుకు భిన్నంగా తాజా అయోధ్య వివాదంపై వెలువరించిన తీర్పు ప్రతిలో తీర్పు రాసిన న్యాయమూర్తి ఎవరన్న పేరును ప్రస్తావించలేదు. ఇలాంటి పరిణామం ఇప్పటివరకూ ఎప్పుడూ చోటు చేసుకోలేదని.. ఇదే తొలిసారని అంటున్నారు. సంప్రదాయానికి విరుద్ధంగా ఈ వ్యవహారం ఉందంటున్నారు. ఐదుగురు న్యాయమూర్తులు ఉన్న ధర్మాసనంలో తీర్పు రాసిన న్యాయమూర్తి పేరును ప్రకటించకుండానే తీర్పు పాఠాన్ని విడుదల చేశారు.

దీంతో.. ఈ తీర్పు రాసిన న్యాయమూర్తి ఎవరన్నది మిస్టరీగా మారిందని చెప్పాలి. అయోధ్య కేసుకు సంబంధించి మరిన్ని ఆసక్తకర అంశాలు ఉన్నాయి. సుప్రీంకోర్టు చరిత్రలో అయోధ్య కేసు మారధాన్ విచారణలో రెండో స్థానాన్ని సంపాదించింది. మధ్యవర్తుల పరిష్కారం విఫలం కావటంతో.. 40 రోజుల వరుస విచారణను నిర్వహించారు. అనంతరం తీర్పును వెలువరించారు. 1973లో రాజ్యాంగ మౌలిక నిర్మాణానికి సంబంధించి కేశవానంద భారతి కేసు విచారణను 68 రోజుల మారధాన్ ను నిర్వహించింది. ఈ కేసు తర్వాత అయోధ్య వివాదంపై విచారణే సుదీర్ఘంగా సాగిందని చెప్పాలి.