Begin typing your search above and press return to search.

సచిన్ ఇంట్లో మిస్టరీ గెస్ట్‌ ఎవరో తెలిసింది!

By:  Tupaki Desk   |   6 Sep 2016 9:29 AM GMT
సచిన్ ఇంట్లో మిస్టరీ గెస్ట్‌ ఎవరో తెలిసింది!
X
వినాయక చవితి సందర్భంగా సోమవారం తన అభిమానులకు మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్ టెండూల్కర్‌ చిన్న టెస్ట్‌ ఒకటి పెట్టాడు. గణేష్‌ చతుర్థి సందర్భంగా తన నివాసంలో బొజ్జ గణపతికి సచిన్‌ చేసిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో కుటుంబ సభ్యులతో పాటు కొందరు ప్రత్యేక అతిథులు కూడా హాజరయ్యారు. ఈ ప్రత్యేక అతిథుల్లో స్నేహితులు కూడా ఉన్నారనుకోండి. అయితే ఈ విషయంపై స్పందించిన సచిన్.. గణపతికి పూజ చేస్తూ, నమస్కరిస్తున్న ఒక వ్యక్తి ఫోటోను వెనక నుంచి తీసి ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.

ఆ ఫోటోను ట్విట్టర్ లో పోస్ట్ చేస్తున్న సందర్భంగా ఈ "మిస్టరీ అతిథి" ఎవరో గుర్తుపట్టండి అంటూ ఒక కొంటె ప్రశ్నను సంధించాడు సచిన్. సహజంగానే ఈ ప్రశ్న సచిన్ అభిమానుల్ని ఉత్సాహ పరిచింది. దీంతో చెలరేగిపోయి, బుర్రకు పదునుపెట్టిన చాలా మంది నెటిజన్లు... తమకు అనిపించిన సమాధానలను పోస్ట్ చేశారు. వీరిలో కొందరు ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి.. రోజర్‌ ఫెదరర్‌ అని - మరొకరు.. రికీ పాంటింగ్‌ అని, ఇంకొకరు బ్రెట్‌ లీ అనీ ఇలా రకరకాల పేర్లు చెప్పి సమాధానాలు పంపారు. ఇప్పటికే ఆలస్యం అయ్యింది ఇంకా అభిమానులను విసిగించడం బాగోదని భావించిన సచిన్‌ స్వయంగా ఆ గెస్ట్‌ ఎవరనేది వెల్లడించాడు. అతను ఎవరో కాదు దక్షిణాఫ్రికా క్రికెట్‌ దిగ్గజం జాంటీ రోడ్స్‌.

ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి జాంటీ రోడ్స్.. అతనికి భారతీయ సంస్కృతీసంప్రదాయాలంటే ఎనలేని గౌరవం.. అందుకోసమే తన కూతురికి "ఇండియా" అని కూడా పేరు పెట్టాడు. గణపతి ఆశీస్సులు పొందేందుకు తన ఇంటికి వచ్చింది ఇతడే అని సచిన్‌ తెలిపాడు. జాంటీరోడ్స్‌ తోపాటు యువరాజ్‌ సింగ్‌ కూడా లిటిల్‌ మాస్టర్‌ ఇంట్లో పూజలకు హాజరై గణపతిని ప్రార్థించాడు.