Begin typing your search above and press return to search.

గుబులు పుట్టించిన గుండ్రటి వస్తువు!

By:  Tupaki Desk   |   4 Nov 2016 2:56 AM GMT
గుబులు పుట్టించిన గుండ్రటి వస్తువు!
X
ఏలియన్స్ సంగతులు వెలుగులోకి వచ్చినప్పటినుంచీ గ్రహాంతర వాసులు, ఆకాశంలో రకరకాల వస్తువులు, ఫ్లయింగ్ సాసర్స్ వంటి విషయాలపై ఆసక్తి నెలకొంది. ఆకాశంలో ఏ వింత ఆకారం మేఘాల రూపంలో కనిపించినా కూడా.. దానికీ గ్రహాంతర వాసులకు ముడిపెట్టేయడం జరుగుతుంది. ఈ ఆలోచనలు, వాటిపై ఆసక్తులను పెంచే విషయంలో ముందుంటారు ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్స్. విశ్వంలో మ‌నం ఒంట‌రివాళ్లం కాద‌ని, ఎక్కడో ఓ చోట వేరే జీవం ఉంద‌న్న న‌మ్మకం నిత్యం వ్యక్తపరుస్తుంటారు ఈయన. అయితే... విశ్వంలో గ్రహాంతరవాసులు ఉన్నారా? లేరా? అనే సంగతి కాసేపు పక్కనపెడితే... తాజాగా గ్రహాంతరవాసులకు సంబందించిందని, ఆకాశం నుంచి పడిందని చెబుతున్న ఒక వింత వస్తువు తమిళనాట హాట్ టాపిక్ అయ్యింది.

తమిళనాడులోని, కరూర్‌ జిల్లా గౌండపాళయంలో ఆకాశం నుంచి ఇనుప బంతి ఆకారంలో ఉన్న ఓ వస్తువు కిందపడిందట. దాంతో మొదట స్థానిక ప్రజలు ఈ వస్తువును / పదార్ధాన్ని చూసి భయాందోళనలకు గురయ్యారు. స్థానిక రైతు కుళందైస్వామి ఇంటి సమీపంలో ఈ వింత వస్తువు భారీ శబ్దంతో పైనుంచి పడింది. అది పడిన పది నిముషాల అనంతరం తేరుకున్న ప్రజలు దాని దగ్గరకు వెళ్లి చూడగా.. గుండ్రటి ఇనుప పదార్ధం కనిపించింది. దీంతో గ్రామస్తుల సమచారంతో రెవెన్యూ, పోలీస్‌, అగ్నిమాపకశాఖ సిబ్బంది సహా బాంబ్‌ స్క్వాడ్‌ నిపుణలు కూడా అక్కడకు చేరుకొని పరిశీలించారు. ఆ వస్తువు అసలు గుట్టు రాబట్టేందుకు చెన్నై నుంచి రక్షణ విభాగానికి చెందిన అధికారులను పిలిపించారు.

ఈ అనుమానాలు, అధికారుల పరిశీలనలు అలా ఉంటే మరోవైపు, ఆ వస్తువు ఫ్లయింగ్‌ సాసరని, గ్రాహాంతర వాసుల వస్తువని పుకార్లు రేగడంతో దానిని చూసేందుకు ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నారు.