పోయెస్ గార్డెన్.. ఈ మాట వినగానే ఓవైపు జయలలిత.. మరోవైపు రజినీకాంత్ గుర్తుకొస్తారు. వీళ్లిద్దరి ఇళ్లు ఉన్నది చెన్నైలోని ఆ ఏరియాలోనే. ఇంకా మరెందరో ప్రముఖులు ఉండే ఖరీదైన ప్రాంతమిది. రజినీకాంత్ ఇంటి గురించి చాలామందికి ఐడియా ఉంది. కానీ జయలలిత ఇల్లు మాత్రం పెద్ద రహస్యమే. మహామహులకు సైతం ఆ ఇంటి గురించి అవగాహన లేదు. అన్నాడీఎంకే పార్టీలో ముఖ్య నేతలు సైతం ఇల్లు మొత్తం తిరిగి ఎరుగరు.
జయలలిత తల్లి సంధ్య అసలు పేరు వేదవల్లి. ఆమె పేరు కలిసొచ్చేలా ‘వేద నిలయం’ పేరు పెట్టుకుంది ఈ ఇంటికి జయ. ఈ ఇంటిని 1967లో రూ.1.32 లక్షలకు కొనుగోలు చేసింది జయ. ఆ తర్వాత మరింత స్థలం తీసుకుని 24 వేల చదరపు అడుగులకు ఇంటిని విస్తరించారు. ఇందులో బిల్టప్ ఏరియానే 21,662 చదరపు అడుగులుంటుంది. ప్రస్తుతం ఈ ఇంటి విలువ రూ.45 కోట్లకు పైనే. ఈ ఇల్లు కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉంటుంది. ఏదైనా ప్రత్యేక కార్యక్రమం ఉంటే తప్ప ‘వేద నిలయం’లోకి బయటి వాళ్లకు ప్రవేశం ఉండదు. ముఖ్య నేతలు.. విశ్వాసపాత్రులైన ఐఏఎస్ లకు మాత్రమే ఇంట్లోకి ప్రవేశం లభిస్తుంది. కానీ వాళ్లు కూడా ఇల్లు మొత్తం చూసి ఎరుగరు. వేద నిలయంలో 20 మందికి పైగా పనివాళ్లు ఉంటారని సమాచారం. జయ వెంట మాత్రం శశికళ.. ఆమె మరదలు ఇళవరసి.. ఇరవయ్యేళ్ల వయసుండే ఇద్దరు యువతులు మాత్రమే ఉంటారు. జయకు అవసరమైన మాత్రల నుంచి మేకప్ టచప్ ఇచ్చే వరకూ ఈ ఇద్దరు యువతులే చూసుకుంటారు. వేద నిలయం సమీపంలో ఒక వినాయకుడి గుడి ఉంటుంది. జయ ఇంటి నుంచి బయటకు వచ్చినపుడు.. లోపలికి వెళ్లేటపుడు ఆ వినాయకుడికి మొక్కుతారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/