Begin typing your search above and press return to search.

మైసూరా నేతృత్వంలో రాయలసీమ ఉద్యమం?

By:  Tupaki Desk   |   22 Oct 2015 4:01 AM GMT
మైసూరా నేతృత్వంలో రాయలసీమ ఉద్యమం?
X
ప్రస్తుతం వైఎస్సార్‌ సీపీలో ఉన్న సీనియర్ నేత మైసూరా రెడ్డి పార్టీలో తన స్థాయి, స్థితి పట్ల తీరని అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో త్వరలో పార్టీని వీడి ప్రత్యేక రాయలసీమ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర నిర్వహించడానికి రంగం సిద్దం చేస్తున్నట్లు సమాచారం. తాను ఆశిస్తున్న రాజ్యసభ సీటును విజయసాయి రెడ్డి దక్కించుకోనున్నట్లు వదంతులు రావడంతో కినిసిన మైసూరా పార్టీ నుంచి బయటకు రావాలనే ఆలోచనతో ఉన్నారని తెలుస్తోంది.

పైగా అమరావతి నూతన రాజధానిగా ప్రకటించిన నేపథ్యంలో జరుగుతున్న పరిణామాల పట్ల రాయలసీమలో తీవ్ర అసంతృప్తి చెలరేగుతోంది. దీంతో ఉద్యమ బాట పట్టాలనే లక్ష్యంతో ఇప్పటికే మూడు కమిటీలు కూడా ఏర్పడినట్లు తెలిసింది. గత సంవత్సరం ఎన్నికలకు ముందు రాయలసీమలో ఆందోళనలను బైరెడ్డి రాజశేఖర రెడ్డి రెచ్చగొట్టిన చరిత్ర కూడా ఉంది. మరోసారి ఉద్యమానికి నాయకత్వం వహించాల్సిందిగా బైరెడ్డిపై ఒత్తిడి తీసుకొస్తున్నందున రాజకీయాలకు స్వస్తి చెప్పే ముందు రాయలసీమ లక్ష్యం కోసం పోరాడాలని అతడు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోది.

ఈ నేపథ్యంలో రాయలసీమ ఆందోళనా కమిటీని మైసూరారెడ్డి నేతృత్వంలో త్వరలో ఏర్పర్చబోతున్నట్లు సమాచారం. ఇందుకు గాను బెంగుళూరు - హైదరాబాద్‌ లో ఉన్న రాయలసీమ నేతలు త్వరలో సమావేశం జరిగి కార్యాచరణ పథకాన్ని రూపొందించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశం తర్వాతే ఉద్యమానికి సంబంధించిన ఎజెండా తయారవుతుందని బోగట్టా.

కానీ వాస్తవానికి రాయలసీమ ప్రజల అసంతృప్తి పరాకాష్టకు చేరుకున్న ప్రతి సందర్భంలోనూ ఉద్యమానికి ద్రోహం చేసి చల్లార్చిన పాపం ముఖ్యంగా సీమ నేతలదే అని చెప్పాలి. వందేళ్లుగా రాయలసీమకు అన్యాయం జరుగుతోందని గొంతు చించుకుంటున్నవారు పట్టుమని రెండేళ్లపాటు ఉద్యమాన్ని కొనసాగించలేకపోవడం గమనార్హం. సీమ నేతలే సీమ ప్రయోజనాలకు గుదిబండగా మారుతున్న క్రమం కొనసాగినంతవరకు ఎందరు మైసూరాలు - బైరెడ్డిలు వచ్చి నాయకత్వం వహించినా సీమ సమస్యలకు పరిష్కారం లభించదన్నది వాస్తవం.