Begin typing your search above and press return to search.
దానం రాక...ముందస్తుకు కేసీఆర్ రెడీ
By: Tupaki Desk | 24 Jun 2018 4:36 PM GMTతెలంగాణ ఏర్పాటు ఒక చరిత్ర అని - ఇపుడు రాష్ట్ర పునర్నిర్మాణం మరో చరిత్ర అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఇవాళ మాజీ మంత్రి దానం నాగేందర్ ఆయన అనుచరులకు సీఎం కేసీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎం ప్రసంగిస్తూ..తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం టీఆర్ ఎస్ కు ఓ పవిత్ర యజ్ఞంలాంటిదని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో శత్రువులు ఎంత అడ్డుపడ్డా ఎదుర్కొని ముందుకు వెళ్లామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే...ముందస్తు ఎన్నికల గురించి ప్రకటన చేశారు. ‘జనం రెడీగా ఉన్నారు.. ముందస్తుకు పోదాం సార్’అని అంటున్నారని తన మనసులోని భావనను తనదైన శైలిలో వెల్లడించారు.
దానం చేరిక సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ రాష్ట్రం వస్తే తెలంగాణ చిమ్మచీకటి అవుతుందన్న నాటి ముఖ్యమంత్రి ఇప్పుడు ఎక్కడ ఉన్నారని కిరణ్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి కేసీఆర్ అన్నారు. కేసీఆర్‌ను గద్దె దించడమే కాంగ్రెస్ వాళ్ల దిక్కుమాలిన కర్తవ్యమని మండిపడ్డారు. తెలంగాణ రైతులు రూ.లక్ష కోట్ల పంట పండిస్తున్నారని చెప్పారు.అక్కర మందం దోస్తాన ఉండదని చెప్పారు. మజ్లిస్ పార్టీతో సంస్కారవంతంగా ఉంటామన్నారు. నేడు తెరాస చేసిన పనులు ఇన్నేళ్లుగా వారు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం టీఆర్ఎస్‌కు ఓ పవిత్ర యజ్ఞంలాంటిదని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో శత్రువులు ఎంత అడ్డుపడ్డా ఎదుర్కొని ముందుకు వెళ్లామని పేర్కొన్నారు. ఆర్తి, ఆర్థత నుంచి పుట్టుకొచ్చిందే కళ్యాణలక్ష్మి పథకమని సీఎం అన్నారు. తెలంగాణ 85 శాతం బలహీన వర్గాలున్న రాష్ట్రం. కళ్యాణలక్ష్మిని అగ్రకులాల్లోని పేదలకు కూడా ఇస్తున్నమని సీఎం వెల్లడించారు. సమాజంలోని బాధ, ఆవేదన, ఇతర పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు.
ఏ ఉప ఎన్నిక వచ్చినా టీఆర్ఎస్‌కే అఖండ విజయమన్నారు. ఏ సర్వే చూసిన టీఆర్ఎస్‌కు వందకుపైగా సీట్లు ఖాయమని స్పష్టమవుతుందని చెప్పారు. మళ్లీ టీఆర్ఎస్ దే విజయం ఖామయని, టీఆర్ఎస్ అభ్యర్థులు 50 నుంచి 60 వేల మెజార్టీతో గెలిచే పరిస్థితులున్నాయని సీఎం తెలిపారు. ఇది ఎన్నికల సంవత్సరం కాబట్టి వీళ్లు (విపక్షాలు) ఇంకా పిచ్చి కథలుపడతారు. ఇదంతా అవసరమా, ఈ గోలంతా ఎందుకు, సరే, మరి ముందస్తు ఎన్నికలకు పోదామా? అని నేనే వాళ్లను ప్రశ్నిద్దామనుకుంటున్నా. మా పార్టీ నేతలు కూడా ఇదే మాట అంటున్నారు. ‘జనం రెడీగా ఉన్నారు.. ముందస్తుకు పోదాం సార్’అని! నా లెక్క ప్రకారం కూడా ముందస్తు ఎన్నికలు రావొచ్చని అనుమానంగా ఉంది. ప్రతిపక్షాలు సరేనంటే ముందస్తుకు రెడీగా ఉన్నాం’’ అని కేసీఆర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇతర రాష్ర్టాల ఎన్నికల గురించి కేసీఆర్ విశ్లేషించారు. ఒడిశాలో నవీన్ పట్నాయక్ మళ్లీ గెలుస్తారట అని కేసీఆర్ చెప్పారు. మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లలోను మళ్లీ అక్కడి ముఖ్యమంత్రులే గెలుస్తారట అన్నారు. ప్రస్తుతం అక్కడ బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయి. మంచిగా పని చేసే వాళ్లను జనం అభిమానిస్తారని చెప్పారు. తద్వారా మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, చత్తీస్‌గఢ్ సీఎం రమణ్ సింగ్, ఒడిశా సీఎం పట్నాయక్‌ను సమర్థించారు.
దానం నాగేందర్ ప్రజలకు నాయకత్వం వహించాలని సీఎం సూచించారు. క్రియాశీలకంగా పనిచేస్తే మంచి పదవులు వస్తయని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివఋద్ధి పథకాలతో కాంగ్రెస్ దివాళా తీసిందని సీఎం పేర్కొన్నారు. `తెలంగాణ అన్ని రంగాల్లో ముందుంది. టీఆర్ఎస్ చేసిన పని అప్పుడు మీరెందుకు చేయలేకపోయారు. ప్రజల ప్రత్యక్ష అనుభవంలో టీఆర్ఎస్ సంక్షేమ పథకాలు అమలు జరుగుతుంది. విద్యుత్ సరఫరాలో దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉన్నాం. నాలుగేళ్లలోనే అవార్డులు తీసుకునే స్థాయికి ఎదిగాం. అన్ని వర్గాలను సముచితంగా గౌరవిస్తున్నం. 2020 జూన్‌లోపు చూస్తే ఎక్కడ చూసినా ఆకుపచ్చ తెలంగాణ కనిపిస్తుంది. తెలివైనోళ్లు తెలంగాణలోనే ఉన్నారని రుజువైంది. ఆలిండియా సివిల్స్ టాపర్ అనుదీప్ తెలంగాణ బిడ్డే. ధర్మం, న్యాయం ఉన్న చోట అంతా మంచే జరుగుతుంది.`` అంటూ తనదైన శైలిలో వివరించారు.