Begin typing your search above and press return to search.

గ్రౌండ్ రిపోర్ట్ : 'మైలవరం' ఎవరి వశం..?

By:  Tupaki Desk   |   22 March 2019 12:02 PM GMT
గ్రౌండ్ రిపోర్ట్ : మైలవరం ఎవరి వశం..?
X
అసెంబ్లీ నియోజకవర్గం: మైలవరం
టీడీపీ: దేవినేని ఉమ
వైసీపీ: వసంతకృష్ణ ప్రసాద్‌
జనసేన : పోటీ పడడం లేదు

ఓవైపు వరుసగా విజయాలతో ఊపుమీదున్న నేత.. మరోవైపు ఈసారి ఎలాగైనా వైసీపీ జెండా ఎగురవేయాలని కసితో ఉన్న నేతల మధ్య మైలవరం ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. కృష్ణా జిల్లాలోని మైలవరం నియోజకవర్గం టీడీపీకి ప్రతిష్టాత్మకంగా మారింది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు దగ్గరి సంబంధాలు కొనసాగిస్తున్న దేవినేని ఉమ ఇక్కడ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆయనకు పోటీగా రాజకీయ బ్యాక్ గ్రౌండ్‌ ఉన్న నేతగా వసంతకృష్ణప్రసాద్‌ వైసీపీ నుంచి బరిలోకి దిగుతున్నాడు. ఈ నేపథ్యంలో ఈసారి ఎవరి జెండా ఎగురనుందోనని జిల్లావ్యాప్తంగా ఆసక్తిగా మారింది.

* 'మైలవరం' చరిత్ర:
ఓటర్లు: 2 లక్షల 68 వేలు
మండలాలు: మైలవరం, జి కొండూరు, రెడ్డుగూడెం, విజయవాడ రూరల్‌, గొల్లపూడి, వేమవరం

1955లో మైలవరం నియోజకవర్గం ఏర్పడింది. మొదటి, రెండు సార్లు ఇక్కడ సీపీఐ విజయం సాధించగా ఆ తరువాత కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. ఇక టీడీపీ ఆవిర్భావం తరువాత 1994 నుంచి ఆ పార్టీదే ఆధిపత్యం కొనసాగుతూ వస్తోంది.కమ్మ సామాజిక వర్గం ఎక్కువగా ఉండడంతో టీడీపీకి కలిసోస్తుంది.

* దేవినేని ఉమ ధీమాగా..
దేవినేని ఉమ ప్రస్తుతం టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు.1999, 2004లో నందిగామ నుంచి పోటీ చేసిన ఆయన గెలుపొందారు. ఆ తరువాత ఆ నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడు కావడంతో 2009లో మైలవరం నియోజకవర్గానికి వచ్చారు. వరుసగా రెండు సార్లు విజయం సాధించి చంద్రబాబు హయాంలో మంత్రి వర్యులుగా కొనసాగారు. ఈసారి ఎన్నికల్లోనూ విజయం సాధించి పట్టు నిలుపుకోవాలని వ్యూహాలు పన్నుతుండగా ఆయనను ఎలాగైనా ఓడించాలని వైసీపీ కంకణం కట్టుకుంది.

+ అనుకూలతలు:
-పదేళ్లుగా ఎమ్మెల్యే పనిచేసిన అనుభవం
-చంద్రబాబుకు అత్యంత సన్నిహితుల్లో ఒకరు
-మంత్రిగా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం

+ ప్రతికూలతలు:
-క్షేత్రస్థాయిలో ప్రచారం చేయకపోవడం
-క్యాడర్లో గ్రూపులు ఏర్పడడం
-నియోజకవర్గంలోని కొన్ని మండలాల్లో ఉమపై అసంతృప్తి

* ఉమకు సరైన ప్రత్యర్థిగా వసంతకృష్ణప్రసాద్‌
ఎన్నో ఏళ్లుగా టీడీపీ పాగా వేస్తున్న మైలవరంలో ఈసారి ఎలాగైనా జెండా ఎగురవేయాలని వైసీపీ భావిస్తోంది. అందులో భాగంగా ఈసారి మాజీ మంత్రిగా పనిచేసిన వసంతకృష్ణప్రసాద్‌ ను బరిలోకి దింపింది. వసంతకృష్ణ ప్రసాద్‌ ఒకప్పుడు టీడీపీలో ఉన్న వసంత నాగేశ్వర్‌ రావు కుమారుడు. ఆయన ఎన్టీఆర్‌ హాయాంలో హోంమంత్రిగా కూడా పనిచేశారు. ఇలా రాజకీయ చరిత్ర పెద్దగా ఉన్న వసంత కృష్ణ ప్రసాద్‌ తో ఈసారి ఎలాగైనా మైలవరంను దక్కించుకునేందుకు జగన్‌ ఆయనను అభ్యర్థిగా నిలబెట్టారు. గతంలో పోటీ చేసి ఓడిపోయిన జ్యోగి రమేశ్‌ స్థానంలో వసంతకృష్ణప్రసాద్‌ పోటీ చేస్తుండడంతో ఇప్పుడు అందరి దృష్టి ఆయనపైనే పడింది.

+ అనుకూలతలు:
-రాజకీయ చరిత్ర ఘనం
-ఉమపై ఉన్న వ్యతిరేకత కలిసి రావడం
-తన తండ్రిపై ఉన్న అభిమానం పనిచేయడం

+ ప్రతికూలతలు:
-ధీటైన అభ్యర్థి ప్రత్యర్థి కావడం
-నియోకవర్గంలో పార్టీ బలంగా లేకపోవడం

*జనసేన బరిలో లేదు..కాపులు ఎటువైపు?
ఇక మైలవరంలో కాపుల ఓట్లు కీలకంగా ఉన్నాయి. కానీ ఇక్కడ జనసేన పోటీపెట్టకపోవడంతో వారు ఎటు వైపు తిరిగితే వారిదే విజయం కానుంది. కాపుల మద్దతు ఈసారి వైసీపీకి పడే చాన్స్ ఉంది. టీడీపీతో ఆగ్రహంతో వైసీపీ అభ్యర్థికి లాభం కలుగవచ్చన్న అంచనాలున్నాయి.

*హోరాహోరీలో ఏదైనా జరగొచ్చు..
మైలవరం నియోజకవర్గంలో కాపు సామాజికవర్గం కీలకంగా మారనుంది. గత ఎన్నికల్లో పవన్‌ కల్యాణ్‌ టీడీపీ తరుపున ప్రచారం చేయడంతో దేవినేని ఉమకు కలిసి వచ్చిందనే ప్రచారం ఉంది. ఈసారి జనసేన స్వయంగా రంగంలోకి దిగడంతో ఉమ గెలుపుపై అవకాశాలు తక్కువేనంటున్నాయి. కాపుల మద్దతు వైసీపీకే ఉంది. ఈ నేపథ్యంలో ఎలాగైనా నియోజకవర్గంలో వైసీపీ గెలిచేలా జగన్‌ వ్యూహాలు పన్నుతున్నారు. అంతేకాకుండా కొన్ని మండలాల్లో వైసీపీకి అనుకూల పవనాలు ఉన్నాయి. మిగతా మండలాల్లో గట్టి ప్రచారం చేస్తే వసంతకృష్ణప్రసాద్‌ గెలుపు పెద్ద విషయమేమి కాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.