Begin typing your search above and press return to search.

మయన్మార్ ‘ఒసామా బిన్ లాడెన్’ విడుదల

By:  Tupaki Desk   |   7 Sep 2021 4:45 PM GMT
మయన్మార్ ‘ఒసామా బిన్ లాడెన్’ విడుదల
X
వివాదాస్పద బౌద్ధ సన్యాసి అషిన్ విరాతును మయన్మార్ మిలటరీ విడుదల చేసింది. మయన్మార్ లో ముస్లిం వ్యతిరేక , జాతీయ వాద ప్రసంగాలతో అషిన్ పాపులర్ అయ్యారు.పౌర ప్రభుత్వంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన దేశద్రోహం ఆరోపణలతో జైలుకు వెళ్లారు. అనంతరం ఫిబ్రవరిలో సైనిక తిరుగుబాటు కారణంగా ఆ ప్రభుత్వం కూలిపోయింది.

ఫైర్ బ్రాండ్ గా పేరొందిన ఈ బౌద్ధ సన్యాసి, సైన్యానికి అనుకూలంగా అభిప్రాయలు వ్యక్తం చేస్తుంటారు.ముస్లింలు, ముఖ్యంగా రోహింగ్యాలను లక్ష్యంగా చేసుకొని ఈయన చేసే ప్రసంగాల కారణంగా ఆయనను ‘బౌద్ధ బిన్ లాడెన్’ అని పిలుస్తారు.

అప్పటి అంగ్ సాన్ సూకీ నాయకత్వంలోని నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రటిక్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ , జాతీయవాద ప్రసంగాలు చేస్తూ అషిన్ పలు మిలటరీ ర్యాలీల్లో పాల్గొన్నారు. పౌర ప్రభుత్వంపై ద్వేషాన్ని, ధిక్కార ధోరణులను ప్రోత్సహిస్తున్నారని 2019లో అషిన్ పై చార్జిషీటు నమోదైంది. అప్పుడు తప్పించుకొని తిరిగిన ఆయన గత ఏడాది నవంబర్ లో అధికారులకు లొంగిపోయాడు. అప్పటి నుంచి ఈ కేసు విచారణ కోసం ఎదురుచూస్తున్నారు.

ఈ క్రమంలోనే అషిన్ పై ఉన్న ఆరోపణలన్నీ కొట్టివేసినట్లు సైనిక ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. అందుకు గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. సైనిక ప్రభుత్వానికి మద్దతుగా నిలిచినందుకే ఆయనను విడుదల చేసినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అసిన్ సైనిక ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్టు మిలటరీ తెలిపింది.