Begin typing your search above and press return to search.

సముద్రంలోంచి బయటపడ్డ దెయ్యం నౌక

By:  Tupaki Desk   |   3 Sep 2018 10:33 AM GMT
సముద్రంలోంచి బయటపడ్డ దెయ్యం నౌక
X
భూమిపై మూడొంతలు ఆక్రమించిన సముద్రం లో ఇప్పటికే ఎన్నో అంతుచిక్కని అద్భుతాలున్నాయి. అప్పుడప్పుడూ అవి బయటపడి అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంటాయి. ఇప్పుడు అలాంటిదే ఓ ఘటన చోటుచేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది..

సరిగ్గా తొమ్మిదేళ్ల క్రితం నాటి సంగతి ఇది.. ఇండోనేషియాకు చెందిన ఓ భారీ సరుకు రవాణా నౌక ‘శామ్ రటులంగి పీబీ1600’ మార్గమధ్యంలో అదృశ్యమైంది. చివరి సారిగా తైవాన్ లో ఆ నౌక కనిపించింది. దాని కోసం అప్పట్లో ఎంతగానో గాలించారు. అయినా ఫలితం లేకపోవడంతో ఇక అది సముద్రంలో మునిగిపోయిందని వదిలేశారు. కానీ ఇప్పుడా నౌక అకస్మాత్తుగా దర్శన మిచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

ఆగస్టు 30న దక్షిణ మయన్మార్ తీరంలో ఈ ఓడ కనిపించి అందరనీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ భారీ ఓడను చూసి స్థానికులు అధికారులకు సమాచారం అందించగా వారు వచ్చి లోపలికి వెళ్లి చూశారు. అయితే అందులో సరుకుల అవశేషాలు కానీ.. సిబ్బంది చనిపోతే వారి అస్తిపంజరాలు కానీ ఏవీ కనిపించలేదు.

ఈ భారీ ఓడ గురించి తెలుసుకున్న స్థానిక ఎంపీ నెవిన్ యాంగాన్ మాట్లాడుతూ.. ‘ఓడ మొత్తం గాలించినా లోపల సిబ్బంది అస్తికలు కానీ సరుకుల అవశేషాలు కనిపించలేదని.. ఇది నిజంగా ఆశ్చర్యకరమన్నారు. ఇన్నేళ్ల తర్వాత మునిగిన ఓడ కొట్టుకురావడం సాధ్యం కాదని.. పోనీ ఎవరైనా కొట్టేసి ఇప్పుడు తెచ్చారా అంటే ఆ ఆనవాళ్లు కనిపించడం లేదని తెలిపారు. మరి ఈ ఓడ అకస్మాత్తుగా కనిపించడంపై మయన్మార్ నేవీ అధికారులు కారణాలను అన్వేషిస్తున్నారు. ఇండోనేషియా ప్రభుత్వానికి కూడా కబురు పంపారు. స్థానికులు దెయ్యం ఓడ అంటూ దీన్ని పిలుస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది.