Begin typing your search above and press return to search.

రాజకీయాల్లోకి వస్తే నా భార్య వదిలేస్తుంది

By:  Tupaki Desk   |   26 April 2019 7:33 AM GMT
రాజకీయాల్లోకి వస్తే నా భార్య వదిలేస్తుంది
X
ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ రాజకీయాలపై తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆర్బీఐ నుంచి వైదొలిగాక రాజకీయాల్లోకి వస్తారా అన్న ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ఓ జాతీయ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు..

రఘురామ్ రాజన్ మాట్లాడుతూ తనకు కుటుంబ జీవితమే ముఖ్యమన్నారు. రాజకీయాల కంటే కుటుంబానికే తన ప్రథమ ప్రాధాన్యమన్నారు. ఒకవేళ రాజకీయాల్లోకి వెళితే తన భార్య నాతో సంసారం చేయనని చెప్పిందని హాట్ కామెంట్ చేశారు. రాజకీయాలు అంతటా ఒకేరకంగా ఉంటాయని తెలిపారు. బలమైన కారణం ఏదీ లేకపోయినప్పటికీ నాకు మాత్రం రాజకీయాలపై ఎలాంటి ఆసక్తి లేదన్నారు. కొందరు జనాల్ని బుట్టలో పడేసేలా మాట్లాడి ఓట్లు అడుగుతారని అలాంటి కలలు తన వద్ద లేవన్నారు.

ఇక తాను ఏ పార్టీకి మద్దతుగా లేనని.. నా రచనలన్నీ అన్ని పార్టీలకు అతీతంగానే ఉంటాయని సెలవిచ్చారు. నాకు ఉద్యోగం చేయడమంటేనే ఇష్టమని.. రాజకీయాలపై ఎలాంటి ఆసక్తి లేదన్నారు. ప్రస్తుతం తన విధులతో సంతోషంగా ఉన్నానని తెలిపారు.

ఇక కాంగ్రెస్ కనీస ఆదాయ పథకం గురించి రఘురామ్ రాజన్ స్పందించారు. ఈ పథకంలో ఎన్నో లాభాలున్నాయన్నారు. పేదలకు నగదు అందజేయడం వల్ల వారికి కావాల్సినవి వారు కొంటారని తన మద్దతును తెలిపారు.

కాంగ్రెస్ హయాంలో ఆర్బీఐ గవర్నర్ గా చేసిన రఘురామ రాజన్ స్వతంత్రంగా వ్యవహరించారు. బీజేపీ గద్దెనెక్కాక ఆయన పదవీ కాలాన్ని పొడగించకుండా తీసేసింది. ప్రస్తుతం రాజన్ అమెరికా షికాగో యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా చేస్తున్నారు.

ఇక కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాఘురామ రాజన్ ఆర్థిక మంత్రి అవుతారన్న ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ తన కనీస ఆదాయ పథకాన్ని రూపొందించడంలో రఘురామ్ రాజన్ సాయం చేశాడని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే రాజకీయాల్లోకి రాను అని రాజన్ స్టేట్ మెంట్ ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది.