Begin typing your search above and press return to search.

తన మాటల్ని తప్పుగా చెప్పారంటున్న కమల్

By:  Tupaki Desk   |   7 Dec 2015 3:25 PM GMT
తన మాటల్ని తప్పుగా చెప్పారంటున్న కమల్
X
చెన్నై మహానగరాన్ని దారుణంగా దెబ్బ తీసిన వరదల సందర్భంగా తమిళనాడు ప్రభుత్వం అనుసరించిన వైఖరిపై ప్రముఖ సినీనటుడు కమల్ హాసన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడిన వైనం.. ఒక ఆంగ్ల పత్రికలో ప్రముఖంగా ప్రచురించటం.. అది కాస్తా సంచలనంగా మారటం తెలిసిందే. కమల్ వ్యాఖ్యలపై తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి.. ‘‘అమ్మ’’ జయలలితకు నమ్మిన బంటు పన్నీరు సెల్వం తీవ్రంగా మండిపటం.. ఈ వ్యవహారం హాట్ హాట్ గా మారటంతో కమల్ హాసన్ స్పందించారు.

తాను చెప్పిన విషయాల్ని వక్రీకరించటం కారణంగానే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించారు. తాను కట్టిన పన్ను సొమ్ము ఏమైందంటూ ప్రశ్నించలేదని.. వరద దుస్థితిపై ప్రభుత్వాన్ని అసలు విమర్శించలేదంటూ కొత్త వివరణ ఇస్తున్నారు. అయితే.. ఆంగ్ల పత్రికలో ఆయన అన్నట్లుగా వచ్చిన వ్యాఖ్యలు అందుకు భిన్నంగా ఉన్నాయి. తన లాంటి పన్నుదారులు కట్టిన సొమ్ము ఏమైపోతుందని.. వరదలు లాంటివి చోటు చేసుకున్నప్పుడు ప్రజల్ని ప్రభుత్వాలు విరాళాలు అడగటం ఏమిటంటూ కమల్ మండిపడుతున్నట్లుగా వచ్చాయి.

తాజాగా అందుకు భిన్నంగా.. చాలా వినయంగా.. ప్రభుత్వానికి తాను విధేయుడినన్న విషయాన్ని చెబుతూ.. తాను అనని మాటల్ని అన్నట్లుగా మీడియాలో వచ్చాయని.. తాను చేసిన వ్యాఖ్యల కారణంగా ఎవరి మనోభావాలు దెబ్బ తింటే తాను క్షమాపణలు చెప్పేందుకు సైతం సిద్దంగా ఉన్నారంటూ ప్రకటించారు. తాను ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయలేదని.. తనకు అలాంటి ఉద్దేశం లేదన్న ఆయన.. తాను గడిచిన 36 ఏళ్లుగా ఏ రాజకీయ పార్టీల్లో కలవకుండా అందరిని కలుపుకుపోతున్నానని వ్యాఖ్యానించారు.

తన మాటల్ని తప్పుగా రాయటం వల్ల గందరగోళం ఏర్పడటంపై విచారం వ్యక్తం చేసిన ఆయన.. తాను ఇస్తున్న వివరణ.. మంత్రి పన్నీరు సెల్వం విమర్శలకు బదులు కాదంటూ వినంతో వివరణ ఇచ్చే ప్రయత్నం చేయటం గమనార్హం.