Begin typing your search above and press return to search.

గ‌ర్వ‌ప‌డుతున్నామంటూనే ట్విస్ట్ ఇచ్చిన రాహుల్‌

By:  Tupaki Desk   |   18 Dec 2017 4:11 PM GMT
గ‌ర్వ‌ప‌డుతున్నామంటూనే ట్విస్ట్ ఇచ్చిన రాహుల్‌
X
కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్ష ప‌గ్గాలు చేప‌ట్టిన త‌ర్వాత వెలువ‌డిన‌ గుజరాత్ - హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైన సంగ‌తి తెలిసిందే. ఆ ఓటమిపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్విట్టర్ ద్వారా స్పందించారు. అంత‌కుముందు పార్ల‌మెంట్‌ లోనూ ఆయ‌న రియాక్ట‌య్యారు. ప్రజల తీర్పును స్వాగతిస్తున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. అయితే విలేక‌రుల స‌మావేశం ఏర్పాటు చేసిన రాహుల్ దాన్ని ర‌ద్దు చేసుకోవ‌డం విశేషం.

ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై ట్వీట్ చేసిన రాహుల్ రెండు రాష్ర్టాల్లో ఏర్పాటైన కొత్త ప్రభుత్వాలకు కంగ్రాట్స్ చెప్పారు. తన పట్ల ప్రేమను ప్రదర్శించిన గుజరాత్ - హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు థ్యాంక్స్ చెబుతున్నట్లు రాహుల్ తెలిపారు. కాంగ్రెస్ సోదరసోదరీమణులు తాను గర్వపడేవిధంగా వ్యవహరించారని, మీరు చాలా విభిన్నమైన వారు అని, హుందాతనంతో ఎన్నికల్లో పోరాటం చేశారని - కాంగ్రెస్ పార్టీ గొప్పతనం తన శౌర్యం - హుందాతనంలోనే ఉన్నదని నిరూపించారని రాహుల్ తన ట్విట్‌ లో కార్యకర్తలను కీర్తించారు. గుజరాత్ ఎన్నికల్లో బీజేపీకి 99 - కాంగ్రెస్‌ కు 77 స్థానాలు వచ్చాయి. ఇక హిమాచల్‌లోనూ బీజేపీ 44 - కాంగ్రెస్ 21 సీట్లు దక్కాయి.

ఇదిలాఉండ‌గా... ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన‌ కార్యాల‌యంతో పాటుగా దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు మూగబోయాయి.

ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు మీడియాతో రాహుల్ మాట్లాడనున్నారని స‌మాచారం ఇచ్చి అనంత‌రం ఆ స‌మావేశం వాయిదా వేసుకున్నారు. ఆ పార్టీ నేత అంబికా సోనీ మాట్లాడుతూ తప్పులు ఎంచడం ఈ సమయంలో సరి కాదన్నారు. వాఘేలా వంటి నేతలు తమ పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయినా - ప్రస్తుతం తాము 75 స్థానాల్లో ముందంజలో ఉన్నామన్నారు. మ‌రోవైపు గుజరాత్ - హిమాచల్‌ ప్రదేశ్ రాష్ర్టాల్లో కాంగ్రెస్ వెనుకంజలో ఉండటంతో ఆ పార్టీ నేతలు తమ నివాసాలకే పరిమితమయ్యారు. దీంతో ఆ పార్టీ ఆఫీసులన్నీ జనాలు లేక వెలవెల బోయాయి. దీంతో కాంగ్రెస్ నేత‌ల స్పంద‌న‌ కోసం చూసిన విలేక‌రులు నిరాశ‌కు గుర‌య్యారు. మ‌రోవైపు అనుకున్నంతా స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో కాంగ్రెస్ నేతలు కలవరానికి గురయ్యారు. కాగా, ఎన్నికల ఫలితాలపై రాహుల్ గాంధీ సోనియాను కలిసి మాట్లాడారు.