Begin typing your search above and press return to search.

నా ప్రాణాలకు హాని ఉంది: వైఎస్ వివేకా హత్య కేసు నిందితుడు దస్తగిరి

By:  Tupaki Desk   |   23 April 2022 12:33 PM GMT
నా ప్రాణాలకు హాని ఉంది: వైఎస్ వివేకా హత్య కేసు నిందితుడు దస్తగిరి
X
వైఎస్ వివేకా హత్యకేసులో అప్రూవర్ గా మారిన డ్రైవర్ దస్తగిరి సంచలన ఆరోపణలు చేశారు. అప్రూవర్ గా మారాక తన ప్రాణాలకు రక్షణ కరువైందని.. భద్రత కల్పించాలని వైఎస్ వివేకా డ్రైవర్ గా ఉండి అప్రూవర్ గా మారిన దస్తగిరి సంచలన ఆరోపణలు చేశారు.

తనకు భద్రత నిమిత్తం ఇద్దరు పోలీసులను కేటాయించామని జిల్లా పోలీసు శాఖ చెబుతున్నా వారెవ్వరూ తన ఇంటి వద్ద కాపలా ఉండడం లేదని దస్తగిరి మీడియా ముందు వాపోయారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన ప్రతీసారి సీబీఐ ఎస్పీ రామ్ సింగ్ కు ఫోన్ చేసి చెప్పాలంటే కష్టమవుతుందని పేర్కొన్నారు.

పులివెందులలో ఎక్కడికి వెళ్లాలన్నా తనకు భయంగా ఉందని.. సెక్యూరిటీగా ఎవరూ తన వద్ద ఉండడం లేదని దస్తగిరి ఆవేదన వ్యక్తం చేశారు. సర్వైలెన్స్ పేరు చెప్పి తప్పించుకుంటున్నారని.. పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదని వెల్లడించారు.

తన ప్రాణాలకు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులు అని దస్తగిరి ప్రశ్నించాడు. సెక్యూరిటీ లేకపోవడం వల్ల తన పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదన్నారు. తనకు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని దస్తగిరి ప్రశ్నించారు.

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దస్తగిరి అప్రూవర్ గా మారాడు. ప్రొద్దుటూరు కోర్టులో నిరుడు ఆగస్టు 31న మొదటిసారి 164 సెక్షన్ కింద ఇచ్చిన వాంగ్మూలంలో వైఎస్ వివేకా హత్య కు దారితీసిన పరిస్థితులు, హత్య చేసేందుకు రూపొందించిన ప్రనాళిక, ఎవరెవరు ఎలా హత్య చేశారు? ఎలా తప్పించుకున్నారు? హత్య వెనుక ఉన్న ప్రముఖుల పేర్లను దస్తగిరి వెల్లడించారు.

వైఎస్ వివేకా హత్య కేసులో డ్రైవర్ దస్తగిరి అప్రూవర్ గా మారేందుకు అనుమతినిస్తూ కడప కోర్టు క్షమాభిక్ష ప్రసాదించడంతో హైకోర్టులో మరో నిందితులు ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డి సవాల్ చేశారు. దీంతో కడప కోర్టులు జరిపిన విచారణ వివరాలు తమకు అందించాలని న్యాయమూర్తి కోరారు. తాజాగా ఈకేసును సీబీఐ టేకప్ చేయడంతో కేసు మలుపుతిరిగింది. ఒక్కో సాక్ష్యాన్ని వెలికితీస్తూ కేసులో కీలక విషయాలు రాబడుతోంది.