Begin typing your search above and press return to search.

హథ్రస్‌ కేసు .. ఆ రైతుకి రూ. 50 వేలు నష్టమట !

By:  Tupaki Desk   |   20 Oct 2020 6:00 AM IST
హథ్రస్‌ కేసు .. ఆ రైతుకి రూ. 50 వేలు నష్టమట !
X
ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌ లో దళిత యువతి గ్యాంగ్ రేప్, హత్యోదంతం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించడం తెలిసిందే. యూపీలో మహిళలకు రక్షణ కల్పించడంలో యోగి ఆదిత్యనాథ్ సర్కారు విఫలం చెందిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ కేసు ను ప్రస్తుతం సిబిఐ విచారణ చేస్తుంది. బాధితులు, నిందితులను ఇది వరకే పలుమార్లు విచారించారు. నిందితుల ఇళ్లలో సోదాలు నిర్వహించి కీలక ఆధారాలను ఇప్పటికే సేకరించారు. బాధితులతో కలిసి పంట పొలంలోని క్రైం సీన్‌ ను పరిశీలించారు. ఈ నేపథ్యంలో సీబీఐ విచారణ కారణంగా తన పంట నాశనం అయిందని క్రైం సీన్‌ ఉన్న పంట పొలం యజమాని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

19 ఏళ్ల దళిత బాలిక అత్యాచారానికి గురైన బూల్ ‌గర్హీ గ్రామంలోని పంట పొలాన్ని సీబీఐ అధికారులు పలుమార్లు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. క్రైం సీన్‌ ను కాపాడటానికి పొలానికి దూరంగా ఉండాలని దాని యజమానిని ఆదేశించారు. నీళ్లు పెట్టకపోవడం, కలుపు తీయకపోవటంతో పంట నాశనం అయిపోయింది. ఈ వ్యవహారం పై ఆ రైతు మాట్లాడుతూ.. ‘‘క్రైం సీన్లోని ఆధారాలను పరిరక్షించటానికి దాదాపు రెండున్నర ఎకరాలు ఉన్న నా పొలానికి నీళ్లు పెట్టవద్దని, పొలంలో ఎలాంటి పనులు చేయవద్దని సీబీఐ అధికారులు ఆదేశించారు. దానికి తోడు చాలామంది పంటను తొక్కారు. దీంతో పంట నాశనమై 50 వేల రూపాయల నష్టంతో పాటు మా ఇంటిల్లిపాది కష్టం వృధా అయింది. ప్రభుత్వం నాకు నష్ట పరిహారం ఇప్పించాలి’’ అని డిమాండ్‌ చేశారు.