Begin typing your search above and press return to search.

అన్నాడీఎంకే పార్టీకి కుంభకర్ణుడి వారసత్వం?

By:  Tupaki Desk   |   10 Oct 2016 12:02 PM GMT
అన్నాడీఎంకే పార్టీకి కుంభకర్ణుడి వారసత్వం?
X
అమ్మగా అభిమానించే తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత తీవ్ర అనారోగ్యానికి గురి కావటం..అర్థరాత్రి వేళ.. హుటాహుటిన ఆసుపత్రికి తరలించటం.. ఆమె అంతర్గత అవయువాలు భారీగా దెబ్బ తిన్నాయని.. ఆమె కోమాలోకి వెళ్లిపోయారని కొందరు.. ఇంకొందరు.. పరిస్థితి చేజారి పోయిదంటూ దరిద్ర ప్రచారాల్ని చేసిన వైనం తెలిసిందే. బయట ఇంత జరుగుతున్నా.. అన్నాడీఎంకే పార్టీ నేతలు మాత్రం గమ్మున ఉండిపోయారే తప్పించి.. అమ్మను అమితంగా అభిమానించే వారికి సాంత్వన కలిగేలా ఎలాంటి చర్యలు తీసుకోకపోవటాన్ని మర్చిపోకూడదు.

ఎప్పుడైతే.. డీఎంకే అధినేత కరుణానిధి సీన్లోకి వచ్చేసి.. అమ్మ ఆరోగ్యంపై సందేహాలు వ్యక్తం చేసి.. ఫోటోలు విడుదల చేయాలని.. సమాచారం బయటకు ఇవ్వాలని డిమాండ్ చేయటం.. ప్రజల్లో పలు సందేహాలు వచ్చి.. పరిస్థితి చేజారిపోతుందన్న విషయం అర్థమైన తర్వాత.. పరిస్థితిలో కాస్త మార్పు వచ్చింది. అదే సమయంలో తమిళనాడు ఇన్ ఛార్జ్ గవర్నర్ గా వ్యవహరిస్తున్న విద్యాసాగర్ రావు ఆసుపత్రికి వచ్చి.. అమ్మకు ఢోకా లేదని.. ఆమె కోలుకుంటున్నారన్న మాటను విస్పష్టంగా చెప్పిన తర్వాత కానీ చాలామంది నమ్మకం కలగని పరిస్థితి.

విద్యాసాగర్ మాటల తర్వాత కూడా సందేహాలు వ్యక్తం చేసినోళ్లు లేకపోలేదు. అయితే.. అలాంటి వాదనల్లో ఎలాంటి నిజం లేదన్న విషయం తర్వాత తర్వాత అర్థమైంది. అమ్మ ఎప్పటికి కోలుకుంటారన్న విషయంపై సందేహాలు ఉన్నప్పటికీ.. ఇప్పటికైతే ఆమె అవుటాఫ్ డేంజర్ అన్న భావనలో మాత్రం అత్యధికులు వచ్చేశారు. ఇదిలా ఉంటే.. తాజాగా అన్నాడీఎంకే పార్టీ తన కుంభకర్ణుడి నిద్రను వదిలిపెట్టింది.

అమ్మ ఆరోగ్యం బాగానే ఉందని.. ఆమెకు ఏమీ కాలేదని.. ఆమె కోలుకుంటున్నారన్న ప్రచారం చేయాలని నిర్ణయించారు. అమ్మ ఆరోగ్యంపై వస్తున్న వదంతుల్లో ఎలాంటి నిజం లేదన్న విషయాన్ని భారీగా ప్రచారం చేయాలని నిర్ణయించింది. ‘‘మై సీఎం ఈజ్ ఫైన్’’.. ‘‘నో మోర్ రూమర్స్’’ అనే హ్యాష్ ట్యాగ్ లతో ప్రచారాన్ని మొదలెట్టింది.

అయితే.. ఇలాంటివి ఇంతకు ముందే చేసి ఉంటే.. కోట్లాది మంది అమ్మ అభిమానులు ప్రశాంతంగా ఉండేవారు. అమ్మ ఆరోగ్యంపై పెదవి విప్పేందుకు సైతం ఇష్టపడని వారు.. ఎంతో మందిలో అంతులేని ఆవేదనను మిగిల్చి.. భయపడేలా చేశారని చెప్పాలి. ఓపక్క తమ అభిమాన అధినేత్రికి ఏమైందన్న ఆవేదనకు స్పందించని పార్టీ.. ఇప్పుడు మాత్రం హ్యాష్ ట్యాగ్ ల్ని తగిలించి మరీ ప్రచారం చేయటం చూస్తే.. కుంభకర్ణుడికి అసలుసిసలు వారసులెవరన్నది ఇట్టే అర్థమవుతుందని చెప్పొచ్చు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/