Begin typing your search above and press return to search.

కేఏ పాల్ పుస్తకం.. ప్రకంపనలేనట

By:  Tupaki Desk   |   25 Dec 2016 5:52 AM GMT
కేఏ పాల్ పుస్తకం.. ప్రకంపనలేనట
X
కేఏ పాల్.. ఈ మధ్య ఈ పేరు వినిపించి చాలా కాలం అయిపోయింది. అమెరికా అధ్యక్షుడు తనతో కలిసి డిన్నర్ చేయడానికి తహతహలాడిపోతాడని.. ప్రపంచ దేశాల అధినేతలందరూ తన పాద దాసులని.. తాను అనుకుంటే ఎవరినైనా ముఖ్యమంత్రిని చేయగలనని.. ప్రధానిని దించేయగలనని భారీ స్టేట్మెంట్లు ఇచ్చేయడం మన పాల్ బాబుకు అలవాటు. పాల్ కు అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులున్న మాట వాస్తవం. అమెరికా లాంటి దేశాల్లో ఆయనకు ఫాలోయింగ్ ఉంది. ఆయన చార్టర్డ్ ఫ్లైట్లలో తిరిగే మాటా నిజం. కానీ ఆయన ఇచ్చే స్టేట్మెంట్లే మరీ టూమచ్ గా ఉంటాయి. నమ్మశక్యంగా అనిపించవు. ఈ అతి మాటల వల్లే క్రెడిబిలిటీ పూర్తిగా కోల్పోయాడు. ఆయన నిజాలు చెప్పినా నమ్మే పరిస్థితి లేదిప్పుడు.

ఇలాంటి తరుణంలో మరోసారి పాల్ తనదైన శైలిలో వ్యాఖ్యానాలు మొదలుపెట్టాడు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గెలవడంలో తన పాత్ర కీలకం అంటున్నాడు పాల్. అలాగే తన జీవిత కథ ఆధారంగా ఓ సంచలన పుస్తకం తీసుకురాబోతున్నట్లు.. ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు రేపడం ఖాయమన్నట్లు మాట్లాడాడు. అమెరికా అధ్యక్షుడుగా ట్రంప్ గెలుస్తాడని ఎవరూ ఊహించలేకపోయారని.. ఆయన విజయం వెనుక తన కృషి ఎంతో వుందని అన్నాడు పాల్. ప్రపంచంలో ఇప్పుడు యుద్ధాలు పెరిగిపోయాయని.. అత్యవసరంగా శాంతి నెలకొల్పాల్సి ఉందని పాల్ వ్యాఖ్యానించాడు. త్వరలో తన జీవిత కథ ఆధారంగా ఓ పుస్తకంగా తీసుకొస్తున్నానని.. అందులో వివిధ దేశాధ్యక్షులు.. వారి పాత్రపై కూడా రాస్తున్నానని చెప్పాడు. ఈ పుస్తకం బయటికొస్తే అద్భుతాలు జరగడం ఖాయమన్నాడు. చూద్దాం మరి.. పాల్ పుస్తకం ఎంతటి ప్రకంపనలకు తెర తీస్తుందో?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/