Begin typing your search above and press return to search.

వైసీపీ ఎంపీ నోరు జోరు... ?

By:  Tupaki Desk   |   25 Oct 2021 7:54 AM GMT
వైసీపీ ఎంపీ నోరు జోరు... ?
X
విశాఖ ఎంపీగా ఎంవీవీ సత్యనారాయణ గెలిచారు. ఆయన అంతవరకూ ఒక బిల్డర్ గానే నగర వాసులకు పరిచయం. పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ కూడా పెద్దగా లేదు. అయితే జగన్ని కలసి వైసీపీలో చేరడం. జగన్ వేవ్ లో పార్టీ కూడా గెలవడంతో ఆయన పార్టీలోకి వచ్చిన కేవలం పది నేలల కాలంలోనే ఎంపీ అయిపోయారు. ఇది నిజంగా గొప్ప విషయమే. ఒక రకంగా ఎంపీ లక్కీ అని కూడా అంతా చెప్పుకుంటారు. ఇదిలా ఉంటే ఈ మధ్య కాలం దాకా ఎంపీ గారు తన పనేంటో తానేంటో అన్నట్లుగా ఉండేవారు. ఆయన పెద్దగా ఉపన్యాసాలు కూడా ఇచ్చిన సందర్భాలు లేవు. విశాఖలో ఎంపీ అంటే విజయసాయిరెడ్డి అనే అంతా అనుకునే పరిస్థితి ఉంది. అంటే లోక్ సభ సభ్యునిగా ఎంవీవీ ఎంత సైలెంట్ అన్నది అర్ధమైపోతొంది. అటువంటి ఎంపీ గారు ఒక్కసారిగా నోరు చేసారు, జోరు చేశారు.

ఆ స్పీడ్ లో టంగ్ స్లిప్ అయింది. అంతే అడ్డంగా సోషల్ మీడియాకు దొరికిపోయారు. జనాగ్రహ దీక్షలలో ఆయన మాట్లాడిన మాటలు సరి కొత్త బూతు పురాణాన్నే వినిపించాయి. టీడీపీ నేత పట్టాభి మాట్లాడిన బూతులను తప్పుపడుతూనే ఎంవీవీ కూడా మరింత పచ్చిగా బూతులు వల్లించేశారు. పక్కన ఉన్న మంత్రి అవంతి శ్రీనివాసరావు సర్దుకోకమని చెప్పడంతో ఆయన ఫ్లో ఆగింది, కానీ లేకపోతే ఆ ఆవేశంతో ఇంకెన్ని ఆణిముత్యాలు జాలువార్చేవారో అన్న చర్చ అయితే అందరిలోనూ ఉంది.

ఇంతకీ నీతులు బూతులు ఉన్నవి ఒకరికి చెప్పడానికే కానీ మనకు కాదు అన్న రీతిలో ఎంపీ గారు రెచ్చిపోవడంతో సోషల్ మీడియాలో ఎటు చూసినా ఆయన మీద ట్రోలింగ్ పెద్ద ఎత్తున సాగుతోంది. నిజానికి ఆయన చాలా కామ్ గా ఉంటారు. పెదవి విప్పిందే తక్కువ. అలాంటిది నోరు జారడంతోనే ఇలా ప్రత్యర్ధులకు చిక్కారని అంటున్నారు. మరో వైపు చూస్తే తన నాయకుడు జగన్ని ఎవరో ఏదో అన్నారన్న బాధ అయితే ఉండవచ్చు. కానీ దానికి వాడాల్సిన బాష, సభ్య సమాజం మెచ్చతగినదిగా ఉండాలి. అంతే తప్ప నోరుంది కదా అని మాట్లాడితే టీడీపీ నేత పట్టాభిని ఎందుకు అనుకోవడం అని కూడా విమర్శలు వస్తున్నాయి. మొత్తానికి పట్టాభి ఏదో భాషలో అర్ధం కానీ మాట మాట్లాడారు, కానీ అచ్చ తెలుగులో ఆయన కంటే ఎక్కువగా బూతు వల్లించిన ఎంవీవీ మీద ఏం చర్యలు తీసుకుంటారని అని టీడీపీ నేతలు ఇపుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి ఎంవీవీ తన అతి ఉత్సాహాంతో తాను చిక్కుల్లో పడడమే కాకుండా సర్కార్ని, పార్టీని పడేశారు అంటున్నారు.