Begin typing your search above and press return to search.

మైసూరా చెప్పిన‌.. చెవిటి మేఘం.. గుడ్డి మేఘం క‌థ‌.. ఎవ‌రి గురించి?

By:  Tupaki Desk   |   28 Aug 2021 2:57 AM GMT
మైసూరా చెప్పిన‌.. చెవిటి మేఘం.. గుడ్డి మేఘం క‌థ‌.. ఎవ‌రి గురించి?
X
ఎంవీ మైసూరా రెడ్డి. క‌డ‌ప జిల్లాకు చెందిన కీల‌క నాయ‌కుడు. ఫైర్ బ్రాండ్ నేత‌కూడా. 1980-99 మ‌ధ్య మైసూరా రాజ‌కీయాలు రాష్ట్రంలో జోరుగా సాగాయి. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ.. ఆయ‌న వైఎస్‌పై విరుచుకుప‌డే వారు. త‌న వ‌ర్గం త‌న‌దంటూ.. అధిష్టానం ద‌గ్గ‌ర ప్ర‌త్యేకంగా చ‌క్రం తిప్పారు. అనేక సంద‌ర్భాల్లో దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డితో తీవ్రంగా విభేదించిన విష‌యం రాజ‌కీయ నేత‌ల‌కు అప్ప‌టి త‌రం వారికి బాగానే తెలుసు. అయితే.. అనూహ్యంగా ఆయ‌న వైసీపీ లో చేరి.. తండ్రి వ‌ద్దు.. త‌న‌యుడు ముద్దు అన్న‌ట్టుగా జ‌గ‌న్‌తో చేతులు క‌లిపారు. అయితే.. కొన్నాళ్ల‌కే మ‌ళ్లీ జ‌గ‌న్‌తోనూ ఆయ‌న‌కు బెడిసి కొట్టింది. దీంతో ఇప్పుడు రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్నారు.

ప‌నిలో ప‌నిగా ఆయ‌న కొన్నాళ్లు తాను ఎంత విభేదించినా.. టీడీపీ అధినేత చంద్ర‌బాబుతోనూ స‌ఖ్య‌త‌గా మెలిగారు. అయితే.. ఇటీవ‌ల కాలంలో రాజ‌కీయాల‌కు త‌ట‌స్థంగా ఉంటున్న మైసూరా.. సీమ ప్రాంత స‌మ‌స్య‌ల‌పై స్పందిస్తున్నారు. ఇటీవ‌ల తెలంగాణ ప్ర‌భుత్వం నీటి విష‌యం పై వివాదానికి దిగిన స‌మ‌యంలోనూ ఆయ‌న స్పందించారు. అయితే.. ఏ ప్ర‌భుత్వానిదీ ఆయ‌న త‌ప్ప‌ని చెప్ప‌లేదు కానీ.. ఇలా చేయ‌డం వ‌ల్ల సీమ మ‌రింత ఇబ్బందులు ప‌డుతుంద‌ని మాత్రం వెల్ల‌డించారు. ఇక‌, తాజాగా సీమ రైతుల స‌మ‌స్య‌ల‌పై ఓ పిట్ట క‌థ చెప్పారు. అది కూడా గుడ్డి మేఘం, చెవిటి మేఘం అంటూ.. స‌టైరిక‌ల్‌గా ఆయ‌న చెప్పిన స్టోరీ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. అయితే.. ఇక్క‌డ కూడా ఆయ‌న ఏ ముఖ్య‌మంత్రినీ.. పార్టీనీ నేరుగా విమ‌ర్శించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

ఇదీ.. క‌థ‌..

"దేవేంద్రుడికి రాయలసీమ మీద కోపం వచ్చి మేఘాలను పిలిచి రాయలసీమలో వర్షాలు కురవద్దని ఆదేశించారట. అందులో ఒకటి చెవిటి మేఘం, మరొకటి గుడ్డి మేఘం. చెవిటిది, గుడ్డిది రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో కుండ పోతగా వర్షం కురిపించాయి. దానితో రైతులు విత్తనం వేశారు. చెవిటి మేఘం, గుడ్డి మేఘం వర్షించాయని, రైతులు విత్తనం బాగా వేసుకున్నారని దేవేంద్రుడికి తెలిసింది. రెండు మేఘాల మీద కన్నెర్ర చేశాడట.

చెవిటిది వినపడక, గుడ్డిది కనపడక వర్షించామని, ఇక వర్షించమ‌ని, మా తప్పుని మన్నించండ‌ని వేడుకున్నాయ‌ట‌. మా వల్ల రైతులకు రెండు విధాలా ఇబ్బంది జరుగుతుంది. పంట చేతికొచ్చే సమయంలో వర్షంలేక... పంట ఎండిపోయి, ఆర్థికంగా నష్టపోతారు.

ముందు కురిసిన వర్షం వల్ల సాలు వర్షపాతం ఎక్కువ వచ్చి కరవు ప్రాంతంగా ప్రకటించక ఆర్థిక సహాయం అందదు. మేము చేసిన పని వలన రైతులకు గోడవేటు, చెంపచేటు. రెండు విధాలుగా నష్టం జరిగింది కదా! అన్నాయట. దేవేంద్రుడు శ‌భాష్ అని మెచ్చుకున్నారట!" ఇది మైసూరా చెప్పిన క‌థ‌. మ‌రి ఆ చెవిటి వారు ఎవ‌రు? గుడ్డి వారు ఎవ‌రు? అనేది ఆస‌క్తిగా మారింది. మొత్తానికి మైసూరా చెప్పిన స్టోరీ మాత్రం సీమ‌కు అతికిన‌ట్టు.. కాదు.. గోడ‌కు సున్న‌మేసిన‌ట్టు స‌రిపోతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.