Begin typing your search above and press return to search.
ఇలాంటి చిత్రాలు బాబు టీంకే సాధ్యం
By: Tupaki Desk | 12 Jun 2018 7:24 AM GMTరాజకీయాలను, ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించే పోరాటాల రీతులను గమనిస్తున్నవారు ప్రస్తుత పరిణామాలను చూసి ఆశ్చర్యపోతున్నారు! ప్రధానంగా ఏపీలోని అధికార తెలుగుదేశం పార్టీ చేస్తున్న చిత్రాలను గమనించి..ఇదేం రాజకీయం..ఇదేం నిరసన రూపం అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏపీ ప్రయోజనాల కోసం అంటూ అధికార తెలుగుదేశం పార్టీ చేస్తున్న దీక్షలు - నిరసనల అజెండాగా పెట్టుకొని ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ కార్యాచరణకు ఎంచుకున్న రూపమే ఒకింత కామెడీని తలపిస్తుందని అంటున్నారు. కేంద్రప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు చేస్తున్న అన్యాయానికి నిరసనగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన జన్మదినం రోజున ధర్మ పోరాట దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ దీక్షపై రకరకాల కామెంట్లు ఇటు రాజకీయ పార్టీల నుంచి అటు నెటిజన్ల నుంచి వినిపించాయి.
చంద్రబాబు చేపట్టిన ధర్మ పోరాట దీక్ష విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఉదయం 7 గంటలకు ప్రారంభమై రాత్రి 7 గంటల వరకు కొనసాగింది. ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్ర ప్రయోజనాల కోసం గళం విప్పడం సంతోషకరమని - దీక్ష చేయడం ఆహ్వానించదగ్గ పరిణామమని అయితే...ఒక్కరోజు దీక్ష ఏమిటని టీడీపీ తప్ప అన్ని రాజకీయ పక్షాలు విమర్శించాయి. చంద్రబాబు చేసింది దీక్ష కానేకాదని...ఒకరోజు ఉపవాసమని ఎద్దేవా చేశాయి. చుట్టూ ఏసీలు పెట్టుకొని ఆయన చేసిన దీక్ష స్టేజ్ మేనేజ్డ్ డ్రామాను తలపించిందని నెటిజన్లు సైతం కామెంట్లు చేశారు. అయితే, చంద్రబాబు చేసిన ఈ దీక్ష ఇలా నవ్వుల పాలు అయినప్పటికీ...సరిగ్గా ఇదే రీతిలో టీడీపీకి చెందిన ఓ ఎంపీ సైతం దీక్షకు సిద్ధమయ్యారు.
ఏపీకి ప్రత్యేక హోదా - విభజన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఒక్క రోజు నిరాహారదీక్ష చేపట్టారు. తన జన్మదినం సందర్భంగా నిరాహారదీక్షకు కూర్చున్నారు. అనకాపల్లి నెహ్రూ చౌక్ సెంటర్‌లో ఎంపీ ముత్తంశెట్టి చేపట్టిన నిరాహారదీక్ష సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. బాబు చేసిన దీక్ష రీతిలోనే అనకాపల్లి ఎంపీ ఒకరోజు నిరాహార దీక్ష ఉందంటున్నారు. విశాఖకు రైల్వేజోన్ విషయంలో ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకతను ఎదుర్కుంటున్న నాయకుల జాబితాలో ఉన్న శ్రీనివాసరావు దాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఈ నిరాహరదీక్షను తెరమీదకు తెచ్చారని అనకాపల్లికి చెందిన ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు.