Begin typing your search above and press return to search.

ముస్లింల‌కు రిజ‌ర్వేష‌న్ అక్క‌ర్లేదంటున్న కేంద్ర‌మంత్రి

By:  Tupaki Desk   |   6 March 2017 7:39 AM GMT
ముస్లింల‌కు రిజ‌ర్వేష‌న్ అక్క‌ర్లేదంటున్న కేంద్ర‌మంత్రి
X
బీజేపీ సీనియర్‌ నేత, కేంద్రమంత్రి గిరిరాజ్‌సింగ్‌ మరోసారి ముస్లింలపై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. దేశంలో ముస్లింల జనాభా రోజురోజుకు పెరుగుతోందని, వారికి మైనారిటీ హోదాను ఉపసంహరించుకోవాలని ఆయ‌న కోరారు. తాజాగా కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ ఆదివారం ట్విట్టర్‌ కేంద్రంగా ఈ వ్యాఖ్య‌లు చేశారు. 'మైనారిటీ' పదానికి ఉన్న నిర్వచనాన్ని సమీక్షించాలని పేర్కొన్నారు. దేశంలో ముస్లింలు 20 కోట్ల మందికి పైగా ఉన్నారని, వారికి మైనారిటీ హోదాను ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ముస్లింలకు మైనారిటీ హోదా ఇచ్చే అంశాన్ని పునఃసమీక్షించాలని పేర్కొన్నారు.

కాగా, ముస్లింలపై ఈ త‌ర‌హా వ్యాఖ్య‌లు చేయ‌డం గిరిరాజ్‌కు ఇది కొత్తేం కాదు. ముస్లింలు తక్కువ మంది ఉన్న ప్రాంతాలతో పాటు ఎక్కువ జనాభా ఉన్న ప్రదేశాల్లో కూడా వారు మైనారిటీలుగా చెలామణి అవుతున్నారని గతేడాది నవంబర్‌లో అన్నారు. హిందువులు మరింత మంది పిలల్ని కని, దేశంలో హిందూ జనాభాను పెంచే ప్రయత్నం చేయాలని గిరిరాజ్‌ గతంలో అన్నారు. అందుకే మైనారిటీ హోదాపై కేంద్రం కొత్త చట్టం తీసుకురావాలని కోరారు. గిరిరాజ్‌ బీహార్‌లోని నవాడా లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

ఇదిలాఉండ‌గా...ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల పోరు చివరి దశకు చేరుకున్న విషయం తెలిసిందే. ఈ నెల 8న తుది దశ పోలింగ్‌ జరగనుంది. ప్రధానమంత్రి న‌రేంద్ర‌ మోడీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి పార్ల‌మెంటు నియోజకవర్గం ప‌రిధిలో కూడా పోలింగ్‌ అదేరోజు జరగనుంది. ఈ నేప‌థ్యంలోనే ముస్లింలను లక్ష్యంగా చేసుకొని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని విప‌క్షాలు ముఖ్యంగా వామ‌ప‌క్షాలు, సమాజ్ వాదీ పార్టీ ఆరోపిస్తున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/