Begin typing your search above and press return to search.

మైదుకూరులో ఉద్రిక్త ప‌రిస్థితి ఎందుకంటే?

By:  Tupaki Desk   |   2 Nov 2017 9:29 AM GMT
మైదుకూరులో ఉద్రిక్త ప‌రిస్థితి ఎందుకంటే?
X
చ‌ర్చ‌ల‌తో చాలావ‌ర‌కూ స‌మ‌స్య‌ల్ని ప‌రిష్క‌రించొచ్చు. కానీ.. చేతిలో ఉన్న అధికార‌మే ఆ ప‌ని చేయ‌కుండా అడ్డు ప‌డుతూ ఉంది. ఇప్పుడున్న రోజుల్లో స‌రిగా వ్య‌వ‌హ‌రిస్తే ప్ర‌భుత్వ ప‌నుల‌కు.. అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు ఆటంకం క‌లిగించే ప‌రిస్థితుల్లో ప్ర‌జ‌లు లేరు. ప్ర‌జ‌ల సెంటిమెంట్ల‌ను గౌర‌విస్తూనే.. వారికి వాస్త‌వ ప‌రిస్థితి తెలియ‌జేస్తూ.. మ‌ధ్యేమార్గంగా వ్య‌వ‌హ‌రించ‌టం ద్వారా అన‌వ‌స‌ర‌మైన ఉద్రిక్త‌త‌ల‌కు చెక్ చెప్పొచ్చు.

తాజాగా క‌డ‌ప జిల్లా మైదుకూరులో చోటు చేసుకున్న ఉద్రిక్త ప‌రిస్థితిని చూస్తే.. ఇందులో అధికారులు తీరును ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు. ప్ర‌భుత్వం చేప‌ట్టిన కార్య‌క్ర‌మం గురించి వివ‌రంగా చెప్ప‌టం.. వారికి అర్థ‌మ‌య్యేలా చేయ‌టంలో అధికారులు విఫ‌లం చెందిన‌ట్లుగా తెలుస్తోంది. బ‌ద్వేలు రోడ్డులో ఉన్న ద‌ర్గాను నేష‌న‌ల్ హైవే అధికారులు కూల్చివేశారు. దీంతో ముస్లింలు పెద్ద ఎత్తున ఆందోళ‌న‌కు దిగ‌టంతో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.

ఇదిలా ఉంటే వీరి ఆందోళ‌న‌కు స్థానిక ఎమ్మెల్యే ర‌ఘురామిరెడ్డి మ‌ద్ద‌తు తెల‌ప‌టంతో ఉద్రిక్త ప‌రిస్థితి మ‌రింత వేడెక్కాయి. ద‌ర్గాను కూల్చిన స్థ‌లంలో ముస్లిం మ‌హిళ‌లు వేప మొక్క‌ను నాటి జెండాను పాతి ఈద్గా ఏర్పాటు చేసే ప్ర‌య‌త్నాలు చేస్తుండ‌గా పోలీసులు అడ్డుకున్నారు.

ఈ నేప‌థ్యంలో మైదుకూరులో తీవ్ర ఉద్రిక్త‌త నెల‌కొంది. భారీ ఎత్తున అద‌న‌పు పోలీసు బ‌ల‌గాల్ని సంఘ‌ట‌నా స్థ‌లానికి తెప్పించారు. అడిష‌న‌ల్ ఎస్పీ స్వ‌యంగా మైదుకూరుకు చేరుకొని ప‌రిస్థితిని స‌మీక్షిస్తున్నారు. ఇలాంటి ఉదంతాల్లో అధికారులు ముంద‌స్తుగా ఆయా వ‌ర్గాల వారిని సంప్ర‌దించి.. వారికి ప‌రిస్థితిని వివ‌రిస్తే బాగుండేద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.