వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేకి షాకిచ్చిన ముస్లింలు!

Tue Jun 28 2022 14:06:47 GMT+0530 (IST)

muslims on ysrcp mla rachamallu Siva Prasad Reddy

వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి ముస్లింలు షాకిచ్చారని వార్తలు వస్తున్నాయి. దర్గా గోడ పునర్నిర్మాణానికి ఆయన చేస్తానన్న ఆర్థిక సాయాన్ని వారు తిరస్కరించారు. అందులోనూ ఆయనకు సొంత పార్టీ ముస్లిం నేతలే షాకిచ్చారని చెబుతున్నారు.వివరాల్లోకెళ్తే.. ప్రొద్దుటూరు పట్టణంలో రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా మున్సిపల్ రెవెన్యూ అధికారులు ముస్లింల దర్గా గోడను తొలగించారు. గవిని సర్కిల్ నుంచి ఎర్రగుంట్ల సర్కిల్ వరకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. ఇందులో భాగంగా ఆ మార్గంలోని దర్గా గోడ కూల్చివేతకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇది తీవ్ర వివాదానికి దారి తీసింది. ముఖ్యంగా తమకు తెలియకుండా దర్గాపైకి క్రేనులు ఎలా పంపుతారని ముస్లింలు ఎమ్మెల్యేపై రాచమల్లుపై మండిపడుతున్నారని చెబుతున్నారు.

ప్రొద్దుటూరు పట్టణంలో ముస్లింల ఓట్లు భారీగానే ఉన్నాయి. నియోజకవర్గంలో దాదాపు 30 వేల ముస్లింల ఓట్లున్నాయి. మొదటి నుంచి వీరంతా వైఎస్సార్సీపీతోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో 2014 2019ల్లో ప్రొద్దుటూరు నుంచి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారని చెబుతున్నారు. కాగా అధికారులు కూల్చిన దర్గా ఉన్న వార్డుకు వైఎస్సార్సీపీకి చెందిన మహమ్మద్ గౌస్ మున్సిపల్ కౌన్సిలర్ గా ఉన్నారు. .

టీడీపీ ముస్లిం నాయకుడు ముక్తియార్ పుట్టిన రోజు జూన్ 27న జరిగింది. ఆ వేడుకల్లో టీడీపీ శ్రేణులు మునిగి ఉంటాయని.. దర్గా గోడ కూల్చివేతకు ఇదే సరైన సమయమని అధికారులతో ఎమ్మెల్యే దర్గా గోడను కూల్చివేయించారని అంటున్నారు. అయితే ఎమ్మెల్యే ఒకటే తలస్తే మరొకటి జరిగిందని చెబుతున్నారు.

వైఎస్సార్సీపీకే చెందిన ముస్లిం నేతల నుంచి ఎమ్మెల్యేకు ఈ విషయంలో ప్రతిఘటన ఎదురైందని పేర్కొంటున్నారు. వైఎస్సార్సీపీ ముస్లిం కౌన్సిలర్లతోపాటు ముస్లిం నేతలు ఎదురు తిరిగారు. దీన్ని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆయన వర్గీయులు అస్సలు ఊహించలేదు.

అయితే అప్పటికే దర్గా గోడ కూల్చివేయండంతో పట్టణంలోని ముస్లింలంతా ఏకతాటిపైకి వచ్చి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారని అంటున్నారు. దీంతో ఈ వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి తనకే నష్టం చేస్తోందని భావించిన ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి నష్ట నివారణ చర్యలకు దిగారని చెబుతున్నారు.

ఇందులో భాగంగా కూల్చిన దర్గా గోడను తాను పునర్నిర్మిస్తానని ఆయన ముందుకు వచ్చారు. ముస్లింలపై పైసా ఖర్చు లేకుండా తానే నిర్మిస్తానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. అయితే చేయాల్సిందంతా చేసి ఇప్పుడు ఇలా ప్లేటు ఫిరాయించడం ఏంటని ఎమ్మెల్యేని ముస్లింలు నిలదీసినట్టు ప్రచారం జరుగుతోంది. మీ సహాయం తమకు అక్కర్లేదని.. తాము దర్గా గోడను నిర్మించుకోగలమని ముస్లింలు ఆయనకు తేల్చిచెప్పారని అంటున్నారు.