Begin typing your search above and press return to search.

'ది కేరళ స్టోరీ' నిజమని నిరూపిస్తే రూ.కోటి ఇస్తా

By:  Tupaki Desk   |   2 May 2023 12:52 PM GMT
ది కేరళ స్టోరీ నిజమని నిరూపిస్తే రూ.కోటి ఇస్తా
X
ఈ వారంలో విడుదల కావాల్సిన 'ది కేరళ స్టోరీ' మూవీ మీద వివాదం అంతకంతకూ రాజుకుంటోంది. ఈ సినిమాను బ్యాన్ చేయాలన్న దిశగా రాజకీయ పార్టీలు గళం విప్పుతున్నాయి. ఈ సినిమాను బ్యాన్ చేయాలని కేరళ అధికార పార్టీతో పాటు కాంగ్రెస్ కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఈ సినిమాను తప్పుడు భావనలతో తీసినదిగా కొందరు అభివర్ణిస్తున్నారు. పలువురు ఈ చిత్రాన్ని తప్పు పడుతున్న వేళ.. ఈసినిమా విడుదల మీద కొత్త సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి వేళ.. చిత్ర నిర్మాత మాత్రం నిరసనలకు అంతే బలంగా సమాధానాలు ఇస్తున్నారు.

తాను వాస్తవాల్ని చూపించానని.. అందరూ దాన్ని ఒప్పుకోవాలంటున్నారు. ఇలాంటి వేళ.. ఈ చిత్ర దర్శక నిర్మాతలకు భారీ సవాళ్లు ఎదురవుతున్నాయి. ఈ సినిమాలో చెప్పినట్లుగా.. ఇందులోని కథ నిజమైతే.. దాని ఆధారాలు చూపించాలని.. అలా చేస్తే తాను రూ.కోటి ఇస్తానని ఐయూఎంఎల్ యూత్ విభాగం ముస్లిం యూత్ లీగ్ చీఫ్ పీకే ఫిరోజ్ ప్రకటించారు. యూపీఎప్ లో రెండో అతి పెద్ద భాగస్వామి నుంచి ఈ ఆఫర్ రావటం రాజకీయంగా వేడెక్కేలా చేసింది.

మరోవైపు నజీర్ హుస్సేన్ అనే బ్లాగర్ సైతం ఈ సినిమా కథ నిజంగా జరిగిందని నిరూపించాలని.. అలాంటి ఆధారాలు తనకు ఇస్తే రూ.10లక్షలు ఇస్తానని చెప్పగా.. నటుడు షుక్కుర్ సైతం రూ.11 లక్షల ఆఫర్ ప్రకటించారు. సినిమాలో మాదిరి మతం మార్చుకొని.. ఐసిస్ లో చేరిన మహిళల పేర్లతో కూడిన జాబితాను తనకు ఇవ్వాలని కోరుతున్నారు. ఈ సినిమా వెనుక సంఘ్ పరివార్ ఉందని రాజకీయ వర్గాలు ఆరోపిస్తున్నాయి.

కేరళ నుంచి 32 వేల మందిని సిరియాకు తీసుకెళ్లారని.. తమ వద్ద లెక్కలు ఉంటున్నట్లు సంఘ్ పరివార్ అంటుందని.. ప్రతి పంచాయితీ నుంచి 30 మందిని తీసుకెళ్లారని అంటున్నారు. మరి.. వారి చిరునామాలు అడిగితే మాత్రం ఇవ్వటం లేదంటూ పీకే ఫిరోస్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వివాదంఇలా సాగుతుంటే.. మరోవైపు కేరళ కల్చరల్ మంత్రి షాజి చెరియన్ విభిన్నంగా పిలుపునిచ్చారు.

ఒకవేళ ఈ సినిమా రిలీజ్ అయితే.. ఎవరికి వారుస్వచ్ఛందంగా సినిమాను బహిష్కరించాలన్నారు. ఈ సినిమా గురించి కేరళ ముఖ్యమంత్రి సైతం రియాక్టు అయ్యారు. ది కేరళ స్టోరీ అన్నది విద్వేషాన్ని రగల్చటమే ధ్యేయంగా రూపొందించిన సినిమాగా మండిపడ్డారు. రాష్ట్రంలో ఎన్నికల్ని సంఘ్ పరివార్ లక్ష్యంగా చేసుకుందని.. అందుకే ఈ తరహా పనులు చేస్తుందంటున్నారు.

2018-19 మధ్యలో కేరళ నుంచి 32 వేల మంది హిందూ మహిళలు మిస్ అయ్యారని.. వారంతా బ్రెయిన్ వాష్ కు గురై మతం మార్చుకొని ఐసిస్.. ఇతర ఉగ్ర సంస్థల్లో చేరాని.. భారత్ తోపాటు విదేశాల్లో ఉగ్ర కుట్రలకు సాయం చేస్తున్నారన్నది ''ది కేరళ స్టోరీ'' కథాంశం. అయితే.. ఇదంతా తప్పుడు భావనగా కొట్టేస్తున్నారు. ఎలాంటి ఆధారాలు చూపించకుండా ఇలా సినిమాలు తీయటం ఏమిటన్న ఆగ్రహాన్ని కొందరు వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు మాత్రం ఇదంతా వాస్తవమే అన్నట్లు పోస్టులు పెడుతున్నారు.

ఈ మొత్తం ఎపిసోడ్ పై చిత్ర నిర్మాత కమ్ రచయిత అయిన విపుల్ రియాక్టు అయ్యారు. ప్రజాస్వామ్య దేశంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని.. వాస్తవాలు చేదుగా ఉన్నా అంగీకరించాలన్నారు. కేరళకు చెందిన ఒక యువతి ఇస్లాంలోకి మారి సిరియాకు వెళ్లి చివరకు అప్గాన్ లోని జైల్లో ఉందని.. ఆమె నుంచి ఆమె కుటుంబ సభ్యుల నుంచి సేకరించిన సమాచారంతోనే తాము ముందుకు వెళ్లామనిచెబుతున్నారు.

ఈ సందర్భంగా ఆయన కొన్ని వాదనల్ని తెర మీదకు తీసుకొస్తున్నారు. షూట్ అవుట్ ఎట్ లోఖాండ్ వాలా చిత్రం ముంబైలో షూట్ జరుపుకుంది. అలా అని ముంబయి మొత్తం రౌడీలుఉన్నట్లు అర్థమా? దావూద్ కథను తీయాలంటే ముంబయి నుంచే మొదలుపెట్టాలి. అక్కడే అతను ఆరాచకాలు సాగించాడని.. అలా అని అది ముంబయికి వ్యతిరేకం అవుతుందా? అంటూ విపుల్ చేస్తున్నప్రశ్నలు.. చిత్రాన్ని వ్యతిరేకించే వారికి మరింత మండేలా చేస్తున్నాయి.