Begin typing your search above and press return to search.

ఆమె చెప్పింది.. ట్రంప్ ఏమాత్రం సేఫ్ కాదని..

By:  Tupaki Desk   |   27 Feb 2017 4:07 AM GMT
ఆమె చెప్పింది.. ట్రంప్ ఏమాత్రం సేఫ్ కాదని..
X
కొత్త విషయం బయటకు వచ్చింది. అమెరికాలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా కొత్త చర్చకు తెర తీసిన ఈ ఉదంతం వింటే షాక్ కు గురి కావాల్సిందే. ప్రపంచానికి పెద్దన్న లాంటి అమెరికా అధ్యక్షుడి కార్యక్షేత్రమైన వైట్ హౌస్ లో పని చేసే వందలాది ఉద్యోగుల్లో ఒకే ఒక్క ముస్లిం మహిళా ఉద్యోగి రుమానా అహ్మద్. అలాంటి ఆమె.. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ఎనిమిదంటే.. ఎనిమిది రోజులకే తన పదవికి రాజీనామా చేసిన వైనం తాజా సంచలనంగా మారింది. కాస్త ఆలస్యంగా బయటకు వచ్చిన ఈ ఉదంతంపై ఇప్పుడు పెద్ద చర్చసాగుతోంది.

ముస్లింలను తీవ్రంగా వ్యతిరేకించే ట్రంప్ కానీ అమెరికా అధ్యక్షుడైతే అంతే సంగతులని తాను అనుకున్నానని.. అందుకు తగ్గట్లే ట్రంప్ అధికారంలోకి వచ్చినంతనే ఆయన తీరు అర్థమైందని.. అందుకే.. ఆయన అధ్యక్షుడైన ఎనిమిది రోజులకే తాను తన ఉద్యోగానికి రాజీనామా చేసేసినట్లుగా ఆమె వెల్లడించారు. అధ్యక్ష పదవిని ట్రంప్ చేపట్టిన వెంటనే.. ఒబామా కేర్ ను రద్దు చేయటం.. హెచ్ 1బీ వీసాల మీద కఠినంగా వ్యవహరించటంతో పాటు.. ఏడు ముస్లిం దేశాల నుంచి వచ్చే విదేశీయులపై బ్యాన్ విధించటం లాంటివి చేయటం తెలిసిందే.

ట్రంప్ లాంటి అధ్యక్షుడి సర్కారులో తాను పని చేయటం కష్టమని.. వైట్ హౌస్ లో బురఖాతో పని చేసే ఏకైక వ్యక్తిని తానేనని.. అదంత సేఫ్ కాదన్న ఉద్దేశంతో తాను తన ఉద్యోగానికి రాజీనామా చేసినట్లుగా పేర్కొంది. తన తల్లిదండ్రులు 1978లో బంగ్లాదేశ్ నుంచి అమెరికాకు వలస వచ్చారని.. తాను అమెరికాలోనే పుట్టి పెరిగానని.. జార్జివాషింగ్టన్ వర్సటీ నుంచి డిగ్రీ పట్టా పొందానని.. మాజీ అధ్యక్షుడు ఒబామా నుంచి ఎంతో స్ఫూర్తి పొంది.. తాను కోరుకున్నట్లే 2011లో వైట్ హౌస్ లో ఉద్యోగాన్ని సాధించినట్లుగా పేర్కొంది.

జాతీయ భద్రతా మండలిలోనే పని చేసిన తాను.. ఉద్యోగానికి ఎప్పుడూ బురఖాలోనే వెళ్లేదానినని..ఎప్పుడూ ఎలాంటి ఇబ్బంది ఎదురుకాలేదని..కానీ.. ట్రంప్ అధ్యక్షుడిగా అయ్యాక మాత్రం ఏం చేయాలో పాలుపోక తాను తన ఉద్యోగాన్ని వదులుకోవాల్సి వచ్చిందన్నారు. ఉద్యోగానికి రాజీనామా చేసిన సాయంత్రం తాను రిజైన్ చేసిన విషయాన్ని ట్రంప్ సీనియర్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కమ్యూనికేషన్స్ అడ్వైజర్ మిచెల్ ఆంటోన్ కు విషయాన్ని చెప్పానని.. తొలుత ఆశ్చర్యపోయిన ఆయన.. ఆ తర్వాత.. ప్రభుత్వం నుంచే బయటకు వెళ్లిపోతున్నవా? అని అడిగారే కానీ.. ఎందుకని మాత్రం అడగలేదన్న ఆవేదనను వ్యక్తం చేశారు. ‘‘చాలా అవమానభారంతో మా దేశంలోని చారిత్రక భవనం నుంచి నిష్క్రమించా. నేనో అమెరికన్ గా.. ఒక ముస్లింగా ఉంటా’’ అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/