Begin typing your search above and press return to search.

ఇదంతా మన పొరుగునున్న కర్ణాటకలో జరిగింది..

By:  Tupaki Desk   |   8 March 2017 5:08 PM GMT
ఇదంతా మన పొరుగునున్న కర్ణాటకలో జరిగింది..
X
కొన్ని కథనాలు చదివినప్పుడు.. ఇలాంటి దరిద్రాలు మా దేశంలో ఉండవనుకుంటాం. మేం చాలా హ్యాపీ. వాళ్లతో పోలిస్తే.. మేమెంతో అదృష్టవంతులమంటూ మురిసిపోతుంటాం. కానీ.. అప్పుడప్పుడు అడపాదడపా చోటు చేసుకునే ఉదంతాల్ని చూసినప్పుడు ఒక్కసారి ఉలిక్కిపడే పరిస్థితి. ఇలాంటి వాటిని వార్తల రూపంలోకి తీసుకురావటం ద్వారా సంచలనం చేసేయాలన్న ఉద్దేశం కాదు.. ఇలాంటి పైత్యాన్ని మొదట్లోనే చెక్ చెప్పకపోతే..మనకూ ఐసిస్ తీవ్రవాదులకూ పెద్ద తేడా ఉండదన్న విషయాన్నిమర్చిపోకూడదు. హిందూ.. ముస్లిం.. క్రిస్ట్రియన్.. జైన్.. మతం ఏదైనా కానీ.. మరీ మూర్ఖంత్వంతో మునిగిపోతున్నా.. అందులో పడి.. వ్యక్తిగత స్వేచ్ఛకు ముప్పు వాటిల్లేలా చేస్తుంటే.. అలాంటి వారికి చెక్ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే.. ఇప్పుడీ విషయాన్ని ప్రస్తావిస్తున్నాం. మీ ముందుకు తీసుకొస్తున్నాం.

మత మౌఢ్యంతో పరిమితులు విధిస్తూ.. అంధకారంలోకి ముంచేసే ప్రయత్నాలు ఏ మతంలో జరిగినా ఖండించాల్సిందే. తాజాగా మన పొరుగున ఉన్న కర్ణాటకలో చోటు చేసుకున్న ఉదంతాన్ని చూస్తే.. నిజమా అంటూ ఒక్కసారి షాక్ తినే పరిస్థితి. ఇవాల్టి రోజున రియాలిటీ షోలు కామన్ అయ్యాయి. పాటలు.. డ్యాన్సుల రియాలిటీ షోల పుణ్యమా అని కొత్త.. కొత్త టాలెంట్ బయటకు రావటమే కాదు.. కోట్లాది మందికి స్ఫూర్తిగా మారటమే కాదు.. వ్యక్తిగతంగా మరింత ఆత్మ స్థైర్యాన్ని పెంచేలా చేస్తుంది. మిగిలిన షోల మాదిరే కర్ణాటకలోనూ ఒక మ్యూజిక్ రియాలిటీ షో జరుగుతోంది. ఇందులో భాగంగా 22 ఏళ్ల సుహానా సయ్యద్ అనే అమ్మాయి హిందూ భక్తి గీతాన్ని ఆలపించారు.

ఆమె గొంతు నుంచి జాలువారిన ఆ పాట విని ప్రేక్షకులంతా తన్మయత్వం చెందారు. ఆమె పాట పాడిన తర్వాత అక్కడి వారంతా లేచి నిలబడి మరీ కరతాళ ధ్వనులతో అభినందించారు. అంతేనా.. ఆమె తన పాటతో సమైక్యకు చిహ్నంగా మారారంటూ పొగిడేశారు. సంగీత దర్శకుడు అర్జున్ జన్య అయితే.. ఆమె పాడిన తీరును విపరీతంగా పొగిడేశారు.

ఇంత హ్యాపీగా ఉన్న వేళ.. మంగళూరు ముస్లిమ్స్ అంటూ ఓ ఫేస్ బుక్ పేజీ వారు మాత్రం సుహానాను తిట్టిపోస్తున్నారు. ‘‘మగాళ్ల ముందు పాడి ముస్లిం జాతికి మచ్చ తెచ్చావు. నువ్వేదో ఘనకార్యం సాధించాననుకోకు.. ఆరునెలల్లో ఖురాన్ ను వల్లె వేయటం నేర్చుకున్న వాళ్లు ఎంతో సాధించారు.. పరాయి మగాళ్ల ముందు నీ అందం చూపించేలా నీ తల్లిదండ్రులు ప్రోత్సాహించారు. నీలాంటి వారి వల్ల వారు స్వర్గానికి వెళ్లరు. పర్దాను నువ్వు గౌరవించటం లేదు కాబట్టి.. నువ్వు ధరించిన పర్దాను తీసేయ్’’ అంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యారు.

ఇలాంటి మూఢత్వం ఎక్కడికి తీసుకెళుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అనవసరంగా భావోద్వేగాలు రెచ్చగొడుతూ.. ప్రజల్లో నెగిటివ్ ఆలోచనలు వచ్చేలా వ్యవహరిస్తున్న ఇలాంటి వారిని చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే.. కాస్త దూరాన ఉన్న ఐఎస్ తీవ్రవాదులకు.. మనకూ పెద్ద తేడా లేనట్లే. ఈ రోజు పాటలు పాడొద్దన్న వారు.. రేపొద్దున ఇంట్లో నుంచి రావొద్దని చెబుతారు. తర్వాత బానిసగా ఉండాలని.. తీవ్రవాదులతో వ్యభిచారం చేయాలన్న దుర్మార్గానికి కూడా తెర తీస్తారు. అందుకే.. ఇలాంటి విపరీత పోకడలు పోయే ఏ మతం వారినైనా ఖండించటమే కాదు.. వారిపై చట్టబద్ధమైన చర్యలు తీసుకునేలా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నది మర్చిపోకూడదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/