Begin typing your search above and press return to search.

ముస్లిం ప‌ర్స‌న‌ల్ లా ప్లీన‌రీలో చీలిక‌లు ఎందుకంటే?

By:  Tupaki Desk   |   12 Feb 2018 4:47 AM GMT
ముస్లిం ప‌ర్స‌న‌ల్ లా ప్లీన‌రీలో చీలిక‌లు ఎందుకంటే?
X
హైద‌రాబాద్ లో మూడు రోజులుగా జ‌రుగుతున్న ఇండియా ముస్లిం ప‌ర్స‌న‌ల్ లా ప్లీన‌రీలో లుక‌లుక‌లు మొద‌ల‌య్యాయి. బోర్డు స‌భ్యుల మ‌ధ్య నెల‌కొన్న విభేదాల‌తో ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. ప్లీన‌రీలో చోటు చేసుకున్న ప‌రిణామాల నేప‌థ్యంలో కోర్ క‌మిటీ స‌భ్యుడు మౌలానా స‌ల్మాన్ న‌ద్వీని తొల‌గిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దీంతో.. బోర్డులో చీలిక ఏర్ప‌డిన‌ట్లైంది.

బోర్డులో లుక‌లుక‌ల‌కు కార‌ణాలు చూస్తే.. ప్లీన‌రీలో తొలి రోజు స‌మావేశాల‌కు స‌ల్మాన్ హాజ‌రు కాక‌పోవ‌టం.. అదే రోజున బాబ్రీ మ‌సీదు వివాదాన్ని ప‌రిష్క‌రించ‌టానికి శ్రీ‌శ్రీ ర‌విశంక‌ర్ ను బెంగ‌ళూరులో క‌ల‌వ‌టం వివాదానికి దారి తీసింది. ష‌రియ‌త్ ప్ర‌కారం బాబ్రీ మ‌సీదును వేరే చోటుకు త‌ర‌లించొచ్చ‌ని ర‌విశంక‌ర్ కు స‌ల్మాన్ చెప్ప‌టంతో బోర్డు తీవ్ర ఆగ్రహాన్ని వ్య‌క్తం చేసింది. మొద‌టి రోజు గైర్హాజ‌రైన స‌ల్మాన్ రెండో రోజు ప్లీన‌రీకి హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా స‌భ్యులు ఆయ‌న్ను వ్య‌తిరేకిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

ర‌విశంక‌ర్ తో భేటీ ఎందుక‌య్యారంటూ నిల‌దీశారు. బాబ్రీ ఇష్యూను రాజ‌కీయం చేస్తున్నార‌ని.. అందుకే అది ఏళ్ల‌కు ఏళ్లుగా సాగుతుంద‌న్నారు. కోర్టులో కాకుండా బ‌య‌టే దాన్ని ప‌రిష్క‌రించుకోవాల‌న్న ఉద్దేశంతో ర‌విశంక‌ర్ ను క‌లిసిన‌ట్లుగా ఆయ‌న చెప్పారు. అయితే.. బోర్డుకు తెలియ‌జేయ‌కుండా ఇలా క‌ల‌వ‌టం స‌రికాద‌న్న అభిప్రాయాన్ని ప‌లువురు వ్య‌క్తం చేయ‌గా.. అందుకు స‌ల్మాన్ అంగీక‌రించ‌లేదు. ఇదిలా ఉంటే.. స‌ల్మాన్‌ కు ఇద్ద‌రు మ‌త గురువులు (మౌలానా ర‌షీద్ మ‌ద‌నీ.. మౌలానా మ‌హ‌మూద్ మ‌ద‌నీ)లు మ‌ద్ద‌తు ప‌లికారు.

ఇదిలా ఉంటే.. తాజా వివాదం మీద స‌ల్మాన్ మీడియాతో మాట్లాడారు.ఈ సంద‌ర్భంగా ఒక రాజ‌కీయ పార్టీని ఉద్దేశించి ప‌రోక్షంగా విమ‌ర్శ‌లు చేశారు. బాబ్రీ మ‌సీదు వివాదాన్ని రాజ‌కీయం చేస్తున్నార‌ని.. అందుకే అది ఏళ్లు గ‌డిచినా ప‌రిష్కారం కావ‌టం లేద‌న్నారు. బోర్డును ఒక రాజ‌కీయ పార్టీ హైజాక్ చేస్తోందంటూ మ‌జ్లిస్ ను ఉద్దేశించి ప‌రోక్ష విమ‌ర్శ‌లు చేశారు.

తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో తాను బోర్డు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేసిన‌ట్లుగా ప్ర‌క‌టించారు. కొత్త‌గా ష‌రియ‌త్ ఆధారిత బోర్డును ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఇదిలా ఉంటే.. హైద‌రాబాద్ డిక్ల‌రేష‌న్ కింద మ‌జ్లిస్ అధినేత అస‌దుద్దీన్ ఓవైసీతో స‌మా బోర్డుకు చెందిన ప‌లువురితో క‌లిసి తాము తీసుకున్న నిర్ణ‌యాల్ని ప్ర‌క‌టించారు. దేశంలో ముస్లింల‌పై దాడులు పెరుగుతున్నాయ‌ని.. దీని కార‌ణంగా దేశంలోని ముస్లింల‌కు అభ్ర‌తాభావం వెన్నాడుతోంద‌న్నారు. బాబ్రీ మ‌సీదు విష‌యంలో రాజీ ప‌డే ప్ర‌స‌క్తే లేద‌న్నారు. ష‌రియ‌త్ దృష్టిలో ఒక‌సారి మ‌సీదు నిర్మిస్తే ప్ర‌ళ‌యం వ‌చ్చినా అది మ‌సీదుగానే ఉంటుందే కానీ త‌ర‌లించే ప్ర‌స‌క్తే ఉండ‌ద‌న్నారు. ట్రిపుల్ త‌లాక్ బిల్లును రాజ్య‌స‌భ‌లో ఆపేందుకు విప‌క్షాల‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఒక‌వేళ‌.. రాజ్య‌స‌భ‌లో బిల్లు పాస్ అయితే.. అత్యున్న‌త న్యాయ‌స్థానం దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్ల‌నున్నార‌ట్లుగా వెల్ల‌డించారు.