Begin typing your search above and press return to search.

ఏర్నాకుళం వెళ్లే వారంతా.. ఆ మెట్రో స్టేషన్ మెట్లు ఎక్కి రండి

By:  Tupaki Desk   |   31 Dec 2021 7:33 AM GMT
ఏర్నాకుళం వెళ్లే వారంతా.. ఆ మెట్రో స్టేషన్ మెట్లు ఎక్కి రండి
X
అందరూ నడిచే దారిలో నడిస్తే ప్రత్యేకత ఏముంటుంది? రోటీన్ కు భిన్నంగా.. అవుటాప్ ద బాక్సులో ఆలోచిస్తే.. అదిరే ఐడియాలు సొంతమవుతాయి. అలాంటి ప్రయత్నమే ఒకటి కేరళలోని ఏర్నాకుళంలోని ఒక మెట్రో స్టేషన్ లో చేశారు. ఆ స్టేషన్ కు వెళ్లే ప్రయాణికులు కాస్త ఇబ్బంది అయినా సరే.. లిఫ్టు.. ఎక్స్ లేటర్ (కదిలే మెట్లు) లాంటి వసతులు ఉన్నా.. వాటిని వదిలేసి.. మెట్లు ఎక్కేందుకే ఆసక్తి చూపిస్తున్నారు. ఇంతకీ ఆ మెట్రో స్టేషన్ పేరు.. ఎర్నాకుళం ఎంజీ రోడ్. దీనికి కారణం.. అక్కడ ఏర్పాటు చేసిన టెక్నాలజీ మాయాజాలంగా చెప్పాలి.

ప్రజల ఆరోగ్యాన్ని పెంచేందుకు వీలుగా.. వారిలో మెట్లను ఎక్కటం ద్వారా క్యాలరీలు కరిగించేందుకు వీలుగా.. సరికొత్త ఆలోచన చేశారు. ఈ మెట్లను పియానో కీబోర్డులా పని చేసేలా చేశారు. దీంతో.. మెట్లు ఎక్కినంతనే.. పియానోలా మాదిరి సంగీత స్వరం వెలువడుతుంది. అంతేకాదు.. స్పెషల్ ఎఫెక్టుగా లైట్లు వెలుగుతాయి కూడా. దీంతో.. ఈ అనుభూతిని సొంతం చేసుకోవటం కోసం మళ్లీ మళ్లీ మెట్లు ఎక్కుతున్నారట.

కేరళలోని కొచ్చి మెట్రో రైల్ లిమిటెడ్ అధికారులు కాస్తంత భిన్నంగా ఆలోచించి.. ఒక మెట్రో స్టేషన్ లో మ్యూజికల్ స్టెయిర్ కేసును ఏర్పాటు చేశారు. ఈ మెట్ల మీద అడుగు పెట్టినంతనే.. లైట్లు వెలగటం.. పియానో.. కీ బోర్డు నుంచి వచ్చే మ్యూజిక్ వినిపిస్తుంది. ఈ మెట్లను ఎక్కి.. మ్యూజిక్ ను ఎంజాయ్ చేయటం ద్వారా తమ ఒత్తిడిని మర్చిపోతున్నట్లుగా చెబుతున్నారు.

తమ ప్రయత్నం విజయవంతం కావటంతో.. ఎర్నాకుళలంలోని మిగిలిన మెట్రో స్టేషన్లలో కూడా ఇదే తరహా మ్యూజిక్ స్టెయిర్ కేసును సిద్ధం చేయాలని అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ ఐడియాను హైదరాబాద్ మెట్రో అధికారులు సైతం ఫాలో అయితే బాగుంటుందేమో? ప్రస్తుతం నడుస్తున్న శబరిమల సీజన్ నేపథ్యంలో.. కేరళకు వెళ్లే వారిలో ఎక్కువ మంది ఎర్నాకుళంలో ట్రైన్ ఎక్కటం కానీ దిగటం కానీ చేస్తుంటారు. ఆ సందర్భంలో ఎంజీ రోడ్ లోని మెట్రో స్టేషన్ కు వెళ్లి.. మ్యూజికల్ స్టెయిర్ కేస్ ఎక్కి ఎంజాయ్ చేయటం మాత్రం మిస్ కావొద్దు.