Begin typing your search above and press return to search.

వైకాపా/టీడీపీ ఎంపీ కూతురిపై హత్య కేసు!

By:  Tupaki Desk   |   30 July 2016 11:15 AM IST
వైకాపా/టీడీపీ ఎంపీ కూతురిపై హత్య కేసు!
X
పాఠశాలలో అతనికి ఇచ్చిన టార్గెట్స్ పూర్తి చేయలేదని, ఈ కారణంగా తమకు అధిక ఖర్చు అయ్యిందని, ఆర్ధికలావాదేవీల్లో కూడా అవకతవకలు జరిగాయనే కారణంతో ఒక ఉద్యోగిని ఆ పాఠశాల యాజమాన్యం సిబ్బందితో దాడి చేయించగా, తీవ్ర గాయాలపాలైన బాధితుడు మృతి చెందిన సంఘటన నంద్యాల లో చోటుచేసుకుంది. ఈ హత్యకేసులో ఎంపీ ఎస్పీ వై రెడ్డి కుమార్తె సుజలపై హత్యకేసు నమోదైంది.

కర్నూలు జిల్లా నంద్యాలలోని నంది అకాడమీ ఇంటర్నేషనల్ స్కూల్ లో పీఆర్ ఓ గా పనిచేస్తున్న సుమంత్.. ఈ ఏడాది బెంగళూరు నుంచి సుమారు 192 మంది విద్యార్థులను చేర్పిస్తానని చెప్పి, ఒక్క విద్యార్థిని కూడా చేర్చలేదట. ఇదే సమయంలో ఆర్థిక లావాదేవీల్లో కూడా కొన్ని తేడాలు రావడం జరిగిందట. దీంతో ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన పాఠశాల యాజమాన్యం అతడిని బందించింది. ఈ వ్యవహారంపై సుమంత్ అన్న, స్కూలు యాజమాన్యానికి సర్ధిచెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది.

అయితే మరుసటి రోజు తెల్లవారుజామున సుమంత్ అనారోగ్యంతో ఉన్నాడని, దీంతో ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించామని పాఠశాల యాజమాన్యం సుమంత్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. దీంతో సుమంత్ కుటుంబ సభ్యులు, బందువులూ ఆస్పత్రికి వెళ్లిచూసే సరికి, అతడు శవమై కనిపించాడు. అతని ఒంటిపై తీవ్రంగా కొట్టినట్లు గాయాలను గుర్తించిన పోలీసులు కేసు నమోదుచేశారు. ఈ వ్యవహారంలో ఎంపీ ఎస్పీవై రెడ్డి కుమార్తె తో సహా దాడికి పాల్పడినట్లు భావిస్తున్న మరో ఇద్దరిపై పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. కాగా.. ఎస్పీవై రెడ్డి 2014 ఎన్నికల్లో వైకాపా టిక్కెట్టుపై గెలిచి, అనంతరం టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే!