Begin typing your search above and press return to search.

సీబీఐ చేతికి.. ఆ దారుణ‌ హ‌త్య కేసు ఫైల్‌!

By:  Tupaki Desk   |   1 Aug 2021 7:46 AM GMT
సీబీఐ చేతికి.. ఆ దారుణ‌ హ‌త్య కేసు ఫైల్‌!
X
జార్ఖండ్ రాష్ట్రంలోని ధ‌న్ బాద్ జిల్లా జ‌డ్జి ఉత్త‌మ్ ఆనంద్ ను కొంద‌రు దుండ‌గులు టెంపో వాహ‌నంతో ఢీకొట్టి చంపిన ఘ‌ట‌న దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం రేకెత్తించింది. ఓ కేసుకు సంబంధించి ఇచ్చే తీర్పు విష‌యంలో అక్క‌సుతోనే ఈ దారుణానికి పాల్పడిన‌ట్టుగా వార్త‌లు వ‌చ్చాయి. ఈ ఘ‌ట‌న‌పై స్పందించిన‌ జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌.. దోషుల‌కు సాధ్య‌మైనంత త్వ‌ర‌గా శిక్ష ప‌డేలా చేస్తామ‌ని చెప్పారు. ఇందులో భాగంగానే ఈ కేసును సీబీఐకి అప్ప‌గించారు. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు విచార‌ణ వేగ‌వంతం చేశారు.

జూలై 28వ తేదీన ఉద‌యం రోడ్డుమీద జాగింగ్ చేస్తున్న జ‌డ్జి ఉత్త‌మ్ ఆనంద్ ను వెనుక‌గా వ‌చ్చిన టెంపో ఢీకొట్టింది. దీంతో.. మొద‌ట ఇది రోడ్డు ప్ర‌మాదంగా భావించారు. కానీ.. లోతుగా ఆలోచిస్తే ఇది హ‌త్య అనే విష‌యం అర్థ‌మ‌వుతోంది. కార‌ణం ఏమంటే.. ఆ స‌మ‌యంలో రోడ్డుపై ఎవ్వ‌రూ లేరు. ఎలాంటి వాహ‌నాలూ లేవు. అంతేకాకుండా.. జ‌డ్జి ఉత్త‌మ్ ఆనంద్ రోడ్డుకు చివ‌ర‌లో న‌డుస్తున్నారు. ఈ వాహ‌నం వెళ్ల‌డానికి రోడ్డంతా ఖాళీగా ఉంది. కానీ.. ఆ చివ‌ర ఉన్న జ‌డ్జిని వెళ్లి ఢీకొట్టింది.

విష‌యం తెలుసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీని ప‌రిశీలించారు. దాని ఆధారంగా ద‌ర్యాప్తు చేప‌ట్టి.. ఆ వాహనాన్ని న‌డిపిన వ్య‌క్తితోపాటు మ‌రో ఇద్ద‌రిని కూడా అరెస్టు చేశారు. విచార‌ణ‌లో ఆ వాహ‌నాన్ని కూడా ఎక్క‌డి నుంచో దొంగిలించిన‌ట్టు తేలింది. దీంతో.. ఇది ఖ‌చ్చితంగా హ‌త్యేన‌ని పోలీసులు నిర్ధారించారు. ఇప్పుడు ఈ కేసు సీబీఐ చెంత‌కు చేర‌డంతో.. అస‌లు నిందితులు ఎవ‌ర‌న్న‌ది తేల‌నుంది.