Begin typing your search above and press return to search.

గూగుల్‌ టేకవుట్‌.. మర్డర్‌ ను ఛేదించింది!

By:  Tupaki Desk   |   22 May 2023 11:01 AM GMT
గూగుల్‌ టేకవుట్‌.. మర్డర్‌ ను ఛేదించింది!
X
ప్రకాశం జిల్లాలో గత కొన్ని రోజులుగా సంచలనం రేపుతున్న వివాహిత హత్య కేసును పోలీసులు ఛేదించారు. సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా నేరస్తులను పట్టుకుంటున్న పోలీసులు ఈ హత్య కేసులో నిందితుడిని కూడా ఇలాగే తేల్చారు. గూగుల్‌ టేకవుట్‌ ద్వారా మృతురాలి భర్తే ఆమెను హత్య చేసినట్టు తేల్చారు.

ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం జిల్లెళ్లపాడుకు చెందిన కోట రాధ(35) అనుమానాస్పద స్థితిలో కొద్ది రోజుల క్రితం మరణించిన సంగతి తెలిసిందే. ఈమెను ఆమె అప్పు ఇచ్చిన వ్యక్తే డబ్బులు ఇస్తాను రమ్మనమని చెప్పి హత్య చేసి రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్టు సృష్టించారని వార్తలు వచ్చాయి. అయితే గూగుల్‌ టేకవుట్‌ ఆధారంగా పోలీసులు రాధ భర్త మోహన్‌ రెడ్డే ఆమెను హతమార్చాడని నిర్ధారించారు.

తన భార్యను తానే హత్య చేశానని ఆమె భర్త మోహన్‌ రెడ్డి కూడా పోలీసు విచారణలో అంగీకరించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ హత్యను తానొక్కడే చేశాడా? లేదా ఇందులో ఇంకా ఎవరైనా సహకరించారా అనేదానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. రాధను హత్య చేయడం.. ఆపై మృతదేహాన్ని రోడ్డుపై పడేయటం.. ఆమె శరీరంపై ఉన్న తీవ్ర గాయాలు ఈ అనుమానాలను పెంచుతున్నాయని చెబుతున్నారు.

తన భార్యను హత్య చేయడానికి కారణం ఆమె తన స్నేహితుడు కాశిరెడ్డికి భారీ మొత్తంలో రుణం ఇప్పించి వాటిని తిరిగి రాబట్టలేకపోవడమే కారణమని తేలింది. అంతేకాకుండా ఆమె ప్రవర్తన మీద కూడా అతడికి అనుమానాలున్నాయి. ఆమె తన స్నేహితుడికి చాలా పెద్ద మొత్తంలో డబ్బులు ఇప్పించి వాటిని తిరిగి రాబట్టలేకపోవడం భార్యాభర్తల ఇద్దరి మధ్య గొడవకు దారి తీసింది. దీంతో తన భార్య రాధను చంపేయాలని మోహన్‌ రెడ్డి నిర్ణయించుకున్నాడు. దీనికి సరైన సమయం కోసం ఎదురుచూశాడు.

ఈ క్రమంలో తన భార్య అప్పు ఇచ్చిన ఆమె స్నేహితుడు కాశిరెడ్డి పేరిట సిమ్‌ కార్డులు కొనుగోలు చేశాడు. అతని పేరుతోనే భార్య ఫోనుకు సందేశాలు పంపుతూ అతడిలాగా ఛాటింగ్‌ చేశాడు. ఈ విషయాన్ని రాధ పసిగట్టలేకపోయింది. ఇలా 15 రోజులపాటు మెసేజులు పెట్టాడు.

కాగా తన స్వగ్రామంలో నిర్వహించే చౌడేశ్వరీ దేవి కొలుపులకు రాధ ఇటీవల పుట్టింటికి చేరింది. దీన్ని తనకు అనుకూలంగా మలుచుకున్నాడు ఆమె భర్త మోహన్‌ రెడ్డి. హత్య జరిగిన ఈ నెల 17న కొద్దిగంటల ముందు కూడా తెలంగాణలోని సూర్యాపేటలో ఇదే తరహా సందేశాలు పంపాడు. తన సెల్‌ ఫోన్‌ పనిచేయటం లేదని చెప్పి ఒక చెరకు రసం బండి నిర్వాహకుడికి నమ్మబలికాడు. అతని వద్ద ఫోన్‌ తీసుకుని తన సిమ్‌ వేసి కాశిరెడ్డి పేరుతో రాధకు మెసేజులు పంపాడు.

పల్నాడు జిల్లా వినుకొండకు చేరుకుని అక్కడ ఓ టీ దుకాణం వద్ద మరొకరి నుంచి సెల్‌ లో తన సిమ్‌ వేసి సాయంత్రం మూడు గంటలకు కనిగిరి వస్తానంటూ రాధకు కాశిరెడ్డిలా మెసేజు పెట్టాడు. వినుకొండ నుంచి కనిగిరి చేరుకుని పామూరు బస్టాండ్‌ కు చేరుకున్నాడు. అక్కడ ఓ యువతితో మాటలు కలిపి ఆమె ఫోన్‌ లో తన సిమ్‌ వేసుకుని కాశిరెడ్డిలా తన భార్య రాధకు మరో సందేశం పెట్టాడు. తాను కనిగిరికి వచ్చానని తెలిపాడు. దీంతో కాశిరెడ్డి తనకు డబ్బులు ఇస్తాడని నమ్మిన రాధ కనిగిరికి వెళ్లింది. అయితే అక్కడ కాశిరెడ్డి బదులు తన భర్త మోహన్‌ రెడ్డి కారులో ఉండటంతో ఆశ్చర్యపోయింది. దీంతో తన భర్త కారు ఎక్కింది. ఆ తర్వాత భార్య రాధను దారుణంగా కొట్టి చున్నీతో గొంతు నులిమి హత్య చేశాడు.

కాగా కాశిరెడ్డి తమ కుమార్తెను హత్య చేశాడని రాధ తల్లిదండ్రులు తొలుత ఫిర్యాదు చేశారు. పోలీసు విచారణ సాగుతుండగా రాధ భర్త మోహన్‌ రెడ్డి అక్కడే ఉన్నాడు. తనకు ఏమీ తెలియదన్నట్టు డ్రామాలాడాడు. ఏడుపు నటì ంచాడు. తన భార్యను ఆమె స్నేహితుడు కాశిరెడ్డే అప్పు తీర్చమని అడిగినందుకు హత్య చేశాడని పోలీసులను నమ్మించాడు.

అయితే పోలీసులు తన కదలికలపై కన్నేశారని మోహన్‌ రెడ్డి పసిగట్టలేకపోయాడు. హత్య జరిగిన సమయంలో నిందితుడు మోహన్‌ రెడ్డి కనిగిరిలోనే ఉన్నట్టు పోలీసులు గూగుల్‌ టేకౌట్‌ ద్వారా నిర్ధారించారు. అయినా ఆ రోజు తాను హైదరాబాద్‌ లో ఉన్నట్టు అందరితోనూ నమ్మబలకడం అనుమానాలకు తావిచ్చింది. దీంతో ఎంత తెలివిగా నాటకమాడినప్పటికీ గూగుల్‌ టేకవుట్‌ ద్వారా రాధ భర్త మోహన్‌ రెడ్డే ఆమెను హతమార్చాడని పోలీసులు నిర్ణయానికొచ్చారు.