Begin typing your search above and press return to search.

పట్టపగలు క్లాస్‌ రూంలో టీచర్‌ పై కత్తితో దాడి .. చేసింది ఎవరంటే ?

By:  Tupaki Desk   |   27 Feb 2021 8:30 AM GMT
పట్టపగలు క్లాస్‌ రూంలో టీచర్‌ పై కత్తితో దాడి .. చేసింది ఎవరంటే ?
X
ఏపీలో పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పిల్లలకు క్లాస్‌ రూంలో పాఠాలు చెబుతుండగా ఓ మహిళా టీచరును మరో వ్యక్తి మచ్చుకత్తితో దాడి చేశాడు. ఈ దృశ్యాన్ని చూసిన విద్యార్థులు ఒక్కసారిగా షాక్‌ కు గురయ్యారు. ఈ ఘటన ఇరగవరం మండలం కాకిలేరు గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. అయితే ఆ మహిళా టీచర్ పై దాడి చేసింది ఆమె భర్తే కావడం గమనార్హం. వివరాల్లోకి వెళ్తే ..

ఎస్సై జానా సతీష్‌ చెప్పిన వివరాల ప్రకారం .. నారాయణపురం గ్రామానికి చెందిన గుత్తుల నాగలక్ష్మికి జంగారెడ్డిగూడెం మండలం వేగవరానికి చెందిన కడలి రామ దుర్గాప్రసాద్ ‌కు 2016లో వివాహం జరిగింది. వీరికి మూడేళ్ల కుమార్తె ఉంది. కొంత కాలంగా భార్యాభర్తలు గొడవలు పడుతున్నారు. ఉపాధ్యాయురాలైన నాగలక్ష్మికి గతనెల 16న కాకిలేరు శివారు సింగోడియన్‌ పేటలోని ఎంపీపీ పాఠశాలకు బదిలీ అయింది. శుక్రవారం మధ్యాహ్నం ఆమె భర్త రామదుర్గా ప్రసాద్‌ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకటాచార్యులు వద్దకు వచ్చి నాగలక్ష్మి టీచర్‌ ను కలవాలని అడిగాడు. ఆమె క్లాస్‌రూమ్‌లో ఉందని చెప్పడంతో క్లాస్‌ రూమ్‌ కు వెళ్లి విద్యార్థులు చూస్తుండగానే జుట్టు పట్టుకుని నేల్‌ కట్టర్ ‌లోని చాకుతో వీపుపై, పక్కటెముకలపై పొడిచేశాడు. దీనితో విద్యార్థులు గట్టిగా అరవడంతో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అక్కడకు చేరుకుని వెంటనే ఎంఈఓ ఎస్‌.శ్రీనివాసరావు ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. ఆ తర్వాత గ్రామస్తుల సహకారంతో టీచర్ నాగలక్ష్మిని పెనుగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యం అందించిన తరువాత తణుకు ఏరియా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం తణుకులోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. రామ దుర్గాప్రసాద్‌ పై జంగారెడ్డిగూడెం పోలీస్‌ స్టేషన్‌ లో వరకట్నం వేధింపుల కేసు ఉందని, ప్రస్తుత ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.