Begin typing your search above and press return to search.

మునుగోడులో క‌న‌క వ‌ర్షం.. అన్ని పార్టీల‌దీ ఇదే దారి!!

By:  Tupaki Desk   |   25 Oct 2022 7:52 AM GMT
మునుగోడులో క‌న‌క వ‌ర్షం.. అన్ని పార్టీల‌దీ ఇదే దారి!!
X
ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాలోని మునుగోడులో వ‌చ్చే నెల 3 న జ‌ర‌గ‌నున్న ఉప ఎన్నిక‌.. పూర్తిగా మ‌నీ చుట్టూనే తిరుగుతోంది. సాధార‌ణంగా..ఎన్నిక‌లు అంటే.. డ‌బ్బుతో ప్ర‌లోభాలు స‌హ‌జ‌మే అయినప్ప‌టికీ.. మునుగోడులో మాత్రం.. పూర్తిగా రాజ‌కీయం అంతా మ‌నీ చుట్టూనే తిరుగుతోంది. గెలుపు కోసం ఆరాటపడుతున్న మూడు ప్రధాన రాజకీయ పార్టీలు డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నాయ‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. ఓటర్లకు పోటీపడి తాయిలాలూ పంచుతున్నాయ‌ని స్థానికులు చెబుతున్నారు. నియోజకవర్గంలోకి డబ్బు ప్రవేశించకుండా పోలీసులు కట్టడి చేసినా.. వివిధ రూపాల్లో న‌గ‌దు చేరాల్సిన వారికిచేరుతుండ‌డం గ‌మ‌నార్హం.

డబ్బును సురక్షితంగా మునుగోడుకు తరలించేందుకు ప్రత్యేక నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకుని కోటికి లక్ష కమీషన్‌ ఇస్తున్నాయనే వార్త‌లు వ‌స్తున్నాయి. రాష్ట్రంలో హుజూరాబాద్‌ తరువాత మునుగోడు ఉప ఎన్నిక ఖరీదైనదిగా పార్టీలు అంచనా వేస్తున్నాయి. కాంగ్రెస్‌, వామపక్షాలకు కంచుకోటైన నియోజకవర్గంలో సిటింగ్‌ స్థానాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ, 2014లో విజయం సాధించిన టీఆర్ ఎస్‌ తిరిగి ఇక్కడ పాగా వేయాలని చూస్తున్నాయి. ఇక‌, ఇక్క‌డ ఏలాంటి ప్రాతినిథ్యం లేని బీజేపీ రాజగోపాల్‌ రెడ్డి గెలుపు ద్వారా పాగా వేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది.

ఇక్కడ మూడు ప్రధాన పార్టీలు ఏదొక విధంగా ఉప ఎన్నికల్లో విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతున్నాయి. దీంతో మూడు పార్టీలు కూడా పోటీపడి డబ్బును మంచి నీళ్లలా ఖర్చు చేస్తుండడంతో పాటు పంచుతున్న‌ట్టు తెలుస్తోంది. మ‌రోవైపుకేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేర‌కు దాదాపు 40 వరకు తనిఖీ కేంద్రాలు, మొబైల్‌ పార్టీలు ఏర్పాటు చేసి డ‌బ్బు ఈ నియోజ‌క‌వ‌ర్గంలోకి రాకుండా.. అడ్డుకునే చ‌ర్య‌లు చేప‌ట్టారు.అయినా.. కూడా త‌నిఖీ అధికారుల క‌ళ్లు గ‌ప్పి.. మ‌రీ.. కొంద‌రు న‌గ‌దును పంచుతున్నార‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.

ఒక జాతీయ పార్టీ కోటికి లక్ష రూపాయిలు మొత్తాన్ని సురక్షితంగా చేర్చినట్లయితే కమిషన్‌ కింద ఇచ్చేందుకు ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ రాజకీయ పార్టీ హైదరాబాద్‌ నుంచి మర్రిగూడ మండలానికి ఆరు కోట్లు నగదు చేర్చేందుకు ఇదే తరహా ఒప్పందం కుదుర్చుకుంది. ఆ బృందం రెండు విడతల్లో మూడేసి కోట్లు లెక్కన ఒకసారి బియ్యం బస్తాలల్లో, మరొకసారి యూరియా బస్తాలల్లో మర్రిగూడకు చేర్చింది. ఇందుకు ఆరు లక్షలు రూపాయిలు కమిషన్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇలా.. మునుగోడులో మ‌నీ మేట‌ర్‌.. జోరుగా సాగుతుండ‌డంతో డ‌బ్బులు పంచ‌లేని పార్టీలు.. త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతుండ‌డం గ‌మ‌నార్హం.