Begin typing your search above and press return to search.

మునుగోడులో.. క‌మ‌లనాథుల కుస్తీ.. గ‌ల్లీగ‌ల్లీలో!!

By:  Tupaki Desk   |   20 Oct 2022 3:57 AM GMT
మునుగోడులో.. క‌మ‌లనాథుల కుస్తీ.. గ‌ల్లీగ‌ల్లీలో!!
X
మునుగోడు నియోజకవర్గంలో కమలనాథుల ప్రచారం పకడ్బందీ ప్రణాళిక మేరకు సాగుతోంది. ప్రతీ 60 మంది ఓటర్లకు ఒక బాధ్యుడు మొదలు మూడు దశల్లో పర్యవేక్షణ సాగుతోంది. ఎన్నికల్లో నిష్ణాతుడైన బీజేపీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జి సునీల్‌ బన్సల్‌తో పాటు ఇద్దరు జాతీయ నాయకులు మునుగోడులోనే మకాం వేశారు. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కోట్లాది రూపాయల సొంత నిధులతో చేపట్టిన సేవా కార్యక్రమాలు, సీఎం కేసీఆర్‌ కుటుంబపాలన, ప్రాజెక్టుల పేరిట ప్రభుత్వ నిధుల దుర్వినియోగం, వంటివి బీజేపీ నేతల ఇంటింటి ప్రచారంలో ప్ర‌ధాన అస్త్రాలుగా ఉన్నాయి.

అయితే.. క‌మ‌లం అంటే.. ఏమ‌నుకుంటారో.. జ‌నాల‌కు అర్ధ‌మ‌వుతుందో లేదో అని(ఎందుకంటే.. తొలిసారి బీజేపీ ఇక్క‌డ అడుగులు వేస్తోంది) 'పువ్వు గుర్త‌మ్మా.. పువ్వు!'' అని ప్ర‌చారం చేస్తున్నారు. ఒకవైపు ఇంటింటి ప్రచారం మరోవైపు కీలక నేతల రోడ్‌ షోలు, జాతీయ నేతలతో భారీ సభకు మునుగోడు ఎన్నికల ప్రణాళిక వేగంగా సాగుతోంది. నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో పల్లెపల్లెనా బీజేపీ ప్రచారం సాగిస్తోంది. నియోజకవర్గ వ్యాప్తంగా 298 బూత్‌లు ఉండగా ఒక్కో బూత్‌కు ఒక ముఖ్య నేతతో పాటు 25మందితో కమిటీలను వేశారు. దీనికి తోడు 60 ఓటర్లకు ఒక ముఖ్య నాయకుడిని బాధ్యుడిగా ఉంచి ఆ ఓట్లు బీజేపీకి పడేలా ప్రణాళికలు రూపొందించారు.

బూత్‌ల వారీగా పరిశీలిస్తే ఒక్క బూత్‌కు మాజీ ఎమ్మెల్యేతో పాటు ఎంపీలు రాష్ట్ర, జిల్లాలో ముఖ్య నాయకులకు బాధ్యత ఇచ్చారు. వీరంతా నిత్యం పరిశీలిస్తున్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జి సునీల్‌బన్సల్‌ మునుగోడులోనే మకాం వేశారు.

ఈయన పూర్తిగా బూత్‌ల్లో ప్రచార బాధ్యతలను మండలాల వారీగా నిత్యం సమీక్షిస్తున్నారు. స్థానిక నేతలకు సమాచారం ఇవ్వకుండా బూత్‌ స్థాయిలో ప్రచారం ఎలా ఉంది, ఎంత మంది హాజరవుతున్నారనే విషయాలను జాతీయ కార్యదర్శులు అరవింద్‌ మీనన్‌, సత్యకుమార్‌ స్థానికంగా మకాం వేసి పర్యవేక్షిస్తున్నారు.

మహిళా మోర్చాకు సంబంధించి 20 బృందాలు ఇప్పటికే ఇంటింటి ప్రచారం చేస్తున్నాయి. అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్‌, రఘునందన్‌రావు, మాజీ ఎమ్మెల్యే డీకే అరుణ, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌లకు ఒక్కొక్కరికి ఒక్కో మండల బాధ్యత అప్పగించారు. వీరు ఆ మండలంలోని ప్రతీ అంశాన్ని పర్యవేక్షిస్తారు.

జంపింగులు అందుకేనా?కీల‌క‌మైన మునుగోడు ఉప పోరు స‌మ‌యంలో బీజేపీ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోంది. జంపింగుల‌ను ప్రోత్స‌హిస్తోంది. తాజాగా బూర న‌ర్స‌య్య గౌడ్‌ను చేర్చుకున్న బీజేపీ పెద్ద‌లు.. రేపో మాపో.. మ‌రో నేతను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు.

ఆయ‌న పైకి ఊహూ.. అంటున్నా.. మ‌న‌సులో మాత్రం ఇప్ప‌టికే 'ఉ' అన్న‌ట్టు.. టీఆర్ ఎస్ వ‌ర్గాలు కూడా భావిస్తున్నారు. ఇదంతా కూడా.. టీఆర్ ఎస్ ప‌ని అయిపోయింది.. ఇక‌, ఆ పార్టీ లేదు.. అని ప్ర‌చారం చేయ‌డంలో భాగంగానే బీజేపీ ఇలా జంపింగుల‌ను ప్రోత్స‌హిస్తోంద‌ని.. టీఆర్ ఎస్ నేత‌లు అంటున్నారు. అయితే..ఈ వ్యూహం ఏమేర‌కు బీజేపీకి క‌లిసి వ‌స్తుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.