Begin typing your search above and press return to search.

ఫుట్ పాత్ పై వృద్ధులు ఉండకూడదట.. ట్రక్కుల్లో కుక్కి ఊరి బయట వదిలేసారు!

By:  Tupaki Desk   |   31 Jan 2021 4:47 AM GMT
ఫుట్ పాత్ పై వృద్ధులు ఉండకూడదట.. ట్రక్కుల్లో కుక్కి ఊరి బయట వదిలేసారు!
X
మానవత్వం మంట గలిసింది. నగరం సుందరం గా ఉండాలంటే ఫుట్ పాత్ పై ఎవరూ ఉండకూడదట. కనిపించ కూడదట. అందుకే ఆ నగర మున్సిపల్ సిబ్బంది ఫుట్ పాత్ పై జీవనం సాగించే వారిని బలవంతంగా ట్రక్కులోకి ఎక్కించుకుని నగరానికి దూరంగా ఓ గ్రామంలో వదిలిపెట్టారు. ఇది వీడియో బయటకు రావడంతో అది వైరల్ గా మారింది. మున్సిపల్ సిబ్బంది నిర్వాకంపై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. ఈ విషయం తెలుసుకున్న ఆ రాష్ట్ర సీఎం ఈ చర్యకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

ఇండోర్ నగరాన్ని గ్రీన్ సిటీ గా మార్చాలని ఆ నగర మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అయితే నగరంలోని పలుచోట్ల నిరాదరణకు గురైన వృద్ధులు ఫుట్ పాత్ పైనే గడుపుతూ జీవనం సాగిస్తున్నారు. వీరు ఫుట్ పాత్ లపై కనిపిస్తుండడంతో నగరం సుందరంగా కనిపించడం లేదని మున్సిపల్ సిబ్బంది భావించారు. వారిని నగరంలోని లేకుండా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అలాంటప్పుడు వారిని ఏదైనా షెల్టర్ కి తరలించినా బాగుండేది. కానీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఫుట్ పాత్ పై వృద్ధులను బలవంతంగా ట్రక్కుల్లో ఎక్కించుకొని నగరానికి దూరంగా తీసుకెళ్లి ఓ గ్రామంలో వదిలేశారు. అసలే చలికాలం వారు ఎలా ఉండగలరు అని కూడా ఆలోచించలేదు. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చేసిన పనిని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది ప్రస్తుతం వైరల్ గా మారింది. నిలువ నీడలేని వృద్ధులపై మీ జులుం ఏమిటని నెటిజన్లు అధికారులపై విమర్శలు చేశారు.

ఈ విషయం మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలియడంతో వెంటనే ఈ పనికి పాల్పడిన అధికారులను విధుల నుంచి తొలగించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి సంఘటన మరోసారి పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఇలాంటి చర్యలు ఉపేక్షించబోమని ట్వీట్ చేశారు. ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ ప్రతాప్ ను సస్పెండ్ చేసి తాత్కాలికంగా భోపాల్ అర్బన్ డెవలప్ మెంట్ డైరెక్టరేట్ కు అటాచ్ చేశారు. వృద్ధులను నడిరోడ్డు పై వదిలేసి వచ్చిన ఇద్దరు మున్సిపల్ కార్మికులు విధుల నుంచి తొలగించారు. వృద్ధులను ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆశ్రమానికి తరలించారు. ఈ ఘటనపై విచారణ నిర్వహిస్తున్నట్లు ఐఎన్సి అదనపు కమిషనర్ రాజం గోంకర్ తెలిపారు.