Begin typing your search above and press return to search.

మున్సిపల్ ఎన్నికల పై హైకోర్ట్ మెట్లెక్కిన కాంగ్రెస్ !

By:  Tupaki Desk   |   2 Jan 2020 8:56 AM GMT
మున్సిపల్ ఎన్నికల పై హైకోర్ట్ మెట్లెక్కిన కాంగ్రెస్ !
X
మున్సిపల్‌ ఎన్నికలకు రిజర్వేషన్లను నిర్దారణ చేయకుండానే రాష్ట్ర ఎన్నికల సంఘం ఎలక్షన్‌ షెడ్యూల్‌ను విడుదల చేయడాన్ని సవాల్‌ చేస్తూ టీపీసీసీ అధ్య క్షులు, నల్లగొండ ఎంపీ ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి హైకోర్టు లో ప్రజా ప్రయోజనాల వాజ్యం (పిల్‌) దాఖలు చేశారు. 120 మున్సిపాల్టీ ల్లో 2,727 వార్డులు, 10 కార్పొ రేషన్ల లో 385 వార్డులుండగా ఓటర్ల జాబితాను సిద్ధం చేయకుండానే షెడ్యూల్‌ విడుదల చేశారని పిల్‌లో పొందుపరిచారు. జనవరి 22న పోలింగ్‌ నిర్వహిస్తామంటూ ప్రకటించారనీ వివరించారు. రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాత ఒక్క రోజు లోనే ఎలక్షన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసి నామినేషన్ల ను కోరడం అన్యాయమని తెలిపారు.

రిజర్వేషన్ ప్రకటన తర్వాత ఆయా కేటగిరీల అభ్యర్థులు కుల సర్టిఫికెట్‌ తీసుకునే గడువు కూడా తగినంత ఉండేలా చూడాలని కోరారు. ఎలక్షన్‌ కమిషన్‌ డిసెంబర్‌ 23న ఇచ్చిన షెడ్యూల్‌ చెల్లదనీ, దానిని తిరిగి ప్రకటించేలా ఆదేశించాలి. అంతకంటే ముందుగా మున్సిపాల్టీలు, మున్సిపల్‌ కార్పొరేషన్ల చైర్మెన్లు, వార్డు మెంబర్ల పదవులకు రిజర్వేషన్లు ఖరారు చేయాలి. చట్ట ప్రకారం అభ్యంతరాలు స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు సమయమివ్వాలి.

ఎన్నికల షెడ్యూల్‌ హడావుడి గా విడుదల చేయడం రాజ్యాంగ వ్యతిరేకం. ఇది తేలే వరకూ ఎలక్షన్‌ షెడ్యూల్‌ అమలును నిలిపేయాలని ఉత్తమ్‌ తన పిల్‌లో హైకోర్టు ను కోరారు. మీడియాలో వస్తున్న సమాచారం మేరకు ఈ నెల 5, 6 తేదీల్లో ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేసే అవకాశం ఉంది. 7న నోటిఫికేషన్‌ జారీ అయితే రిజర్వేషన్లపై అభ్యంతరాలు వ్యక్తంచేసే అవకాశం ఉండదు. అప్పటికప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలు పొందడమూ సాధ్యం కాదని అని పిల్‌లో కోర్టు కు వివరించారు.