Begin typing your search above and press return to search.

ఎన్నికల వేల కళకళలాడుతున్న చిరు వ్యాపారులు..కారణం ఇదే !

By:  Tupaki Desk   |   17 Jan 2020 6:01 AM GMT
ఎన్నికల వేల కళకళలాడుతున్న చిరు వ్యాపారులు..కారణం ఇదే !
X
తెలంగాణలో త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్న విషయం తెలిసిందే. మున్సిపల్‌ ఎన్నికల పుణ్యమా అని ప్రస్తుతం అన్ని వర్గాల ప్రజలకు ఉపాధి లభిస్తోంది. అభ్యర్థులు ఖరారు కావడంతో ప్రచారానికి పదును పెట్టారు. ఓటర్లను తమవైపు తిప్పుకోవడంలో ప్రత్యర్థులతో పోటాపోటీగా సందడి చేయాల్సిందే. పూల దుకాణాలు మొదలు వాహనాల వరకు మంచి గిరాకీ ఏర్పడింది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నూతన పోకడలకు అభ్యర్థులు శ్రీకారం చుడుతున్నారు. విభిన్న తరహాలో ప్రచార సామగ్రి సమకూర్చుకుంటున్నారు.

డప్పు చప్పుళ్లతో అభ్యర్థులు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. పది మంది కళాకారుల బృందం రోజుకు రూ.3 వేలు నుంచి రూ.5 వేల వరకు తీసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది మున్సిపాలిటీల్లో వీరికి గిరాకీ అధికంగా ఉంది. అలాగే అభ్యర్థులు - నాయకులు - కార్యకర్తలు సభలో మాట్లాడేందుకు స్థానికులకు కుర్చీలు వేయాల్సి ఉంటుంది. దీంతో టెంట్‌ హౌస్‌ లకు గిరాకీ పెరిగింది. టెంట్లు - కుర్చీలను బట్టి ధర ఉంటుంది. నిత్యం చిన్న సభకు రూ.4 వేల నుంచి రూ.6 వేలు - పెద్ద బహిరంగ సభ అయితే రూ. 15 వేల నుంచి రూ.20 వేలకు పైగా తీసుకుంటున్నారు. నాయకులు - కార్యకర్తలకు విందు భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో చికెన్ - మటన్‌ బిర్యానీ అందిస్తున్నారు. దీనికై ప్రత్యేకంగా వంట మనుషులను ఏర్పాటు చేసుకుంటున్నారు.

ఎన్నికల సందర్భంగా వాహనదారులకు గిరాకీ లభిస్తుంది. అభ్యర్థులతో పాటు నాయకులు - కార్యకర్తలను ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లడానికి ఐదారు వాహనాలు అవసరం. సొంత వాహనం అభ్యర్థికి అవసరమైతే - మిగతా వారికి అద్దె వాహనాలు సమకూర్చుతున్నారు. ప్రచార రథంతో పాటు బహిరంగ సభలకు జనాన్ని తరలించడానికి వాహనాలు అవసరమవుతుండటంతో ప్రైవేటు వాహన యజమానులకు గిరాకీ లభిస్తుంది. ఇదే అదనుగా వాటి అద్దె ధరలను సైతం పెంచడం విశేషం. ఎన్నికల వేళ జిరాక్స్‌ సెంటర్లకు గిరాకీ ఏర్పడింది. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ఎత్తుగడలు వేస్తుంటారు. ఓటరు జాబితా సేకరించి తదనుగుణంగా ప్రణాళిక రచిస్తారు. అభ్యర్థులు - ప్రచారానికి వచ్చే నాయకులకు పూలదండలు వేయడానికి కార్యకర్తలు పోటీపడుతుంటారు. ప్రచారంలో అభ్యర్థులపై పూల వర్షం కురిపిస్తున్నారు. పూల వ్యాపారుకు గిరాకీ పెరిగింది. బంతిపూలు - గులాబీ దండల ధర పెరిగిపోయింది. ఒక్కో దండ సుమారు రూ.300 పలుకుతోంది.