Begin typing your search above and press return to search.

మున్సిపల్ ఎన్నికల సంగ్రామం ప్రారంభం .. !

By:  Tupaki Desk   |   16 Feb 2021 6:32 AM GMT
మున్సిపల్ ఎన్నికల సంగ్రామం ప్రారంభం .. !
X
ప్రస్తుతం ఓ వైపు గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతుండగనే రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ మున్సిపల్‌ ఎన్నికలకు గ్రీన్ ‌సిగ్నల్‌ ఇవ్వడంతో పట్టణాల్లో ఎన్నికల సంగ్రామం మొదలైంది. దీంతో పట్టణాల్లో ఎన్నికల వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. రాష్ట్రంలోని 12 నగర పాలక సంస్థలు, 140 పురపాలక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయిస్తూ... సోమవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ రీ-నోటిఫికేషన్‌ జారీ చేశారు. వివిధ కారణాల వల్ల 4 నగరపాలక సంస్థలు, 29 పురపాలక/నగర పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడంలేదు. కాగా గతేడాది మార్చిలో ఎక్కడైతే ఆగిందో తిరిగి అక్కడి నుంచే ఈ మార్చిలో ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

దీని ప్రకారం నామినేషన్ల ఉపసంహరణ గడువు వచ్చే నెల 2వ తేదీ నుంచి 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంటుంది. బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితాను 3వ తేదీ సాయంత్రమే ప్రకటిస్తారు. పోలింగ్‌ 10వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. ఎక్కడైనా రీ పోలింగ్‌ నిర్వహించాల్సి వస్తే 13వ తేదీన నిర్వహిస్తారు.ఆ తర్వాత 14వ తేదీ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు కార్యక్రమం ప్రారంభించి.. అదే రోజున ఫలితాలు ప్రకటిస్తారు. నోటిఫికేషన్‌ జారీతో అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్‌ వచ్చే నెల 15 వరకు అమల్లో ఉంటుందని ఎస్ ‌ఈసీ వెల్లడించింది. మున్సిపల్‌ ఎన్నికల్లో ఇప్పటికే నామినేషన్లు వేసిన అభ్యర్థులకు ఇప్పటి వరకు బీ-ఫారం ఇవ్వకపోయినా... విత్‌డ్రా కోసం ఇచ్చిన గడువులోపు దానిని ఇవ్వవచ్చు. ఇప్పటికే బీ-ఫారం ఇచ్చి ఉండి ఆ అభ్యర్థి ఇప్పటికే చనిపోయి ఉంటే... ఆయా పార్టీలు పోటీలో ఉన్న మరో అభ్యర్థికి బీ-ఫారం ఇచ్చే అవకాశం కల్పించారు.

మొత్తం 16 మున్సిపల్‌ కార్పొరేషన్లు ఉండగా, 12కు మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి. అభ్యంతరాలు, కేసుల కారణంగా శ్రీకాకుళం, రాజమహేంద్రి, నెల్లూరు కార్పొరేషన్లకు.. పదవీకాలం పూర్తి కానందున కాకినాడ నగర పాలక సంస్థకు ఎన్నికలు నిర్వహించడం లేదు. మొత్తం 104 మున్సిపాలిటీలు/నగర పంచాయతీలు ఉండగా.. కొత్త ప్రాంతాలు, గ్రామాల విలీనం, వార్డుల పునర్వ్యవస్థీకరణపై అభ్యంతరాలు, కోర్టుల్లో కేసుల దృష్ట్యా 29 చోట్ల ఎన్నికలు జరపడం లేదు.

ఎన్నికలు జరిగే మున్సిపాలిటీలు/నగర పంచాయతీలు :

శ్రీకాకుళం జిల్లా: ఇచ్ఛాపురం, పలాస, పాలకొండ

విజయనగరం: బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు, నెల్లిమర్ల

విశాఖపట్నం: నర్సీపట్నం, యలమంచిలి

తూర్పుగోదావరి: అమలాపురం, తుని, పిఠాపురం,సామర్లకోట, మండపేట, రామచంద్రాపురం,పెద్దాపురం, ఏలేశ్వరం, గొల్లప్రోలు, ముమ్మిడివరం

పశ్చిమగోదావరి: నరసాపురం, నిడదవోలు, కొవ్వూరు, జంగారెడ్డిగూడెం

కృష్ణా: నూజివీడు, పెడన, ఉయ్యూరు, నందిగామ, తిరువూరు

గుంటూరు: తెనాలి, చిలకలూరిపేట, రేపల్లె, మాచర్ల, సత్తెనపల్లి, వినుకొండ, పిడుగురాళ్ల

ప్రకాశం: చీరాల, మార్కాపురం, అద్దంకి, చీమకుర్తి, కనిగిరి, గిద్దలూరు

నెల్లూరు జిల్లా: వెంకటగిరి, ఆత్మకూరు (ఎన్‌), సూళ్లూరుపేట, నాయుడుపేట

అనంతపురం: హిందూపురం, గుంతకల్లు, తాడిపత్రి, ధర్మవరం, కదిరి, రాయదుర్గం, గుత్తి, కల్యాణదుర్గం, పుట్టపర్తి, మడకశిర

కర్నూలు: ఆదోని, నంద్యాల, ఎమ్మిగనూరు, డోన్‌, నందికొట్కూరు, గూడూరు (కె), ఆళ్లగడ్డ, ఆత్మకూరు (కె)

కడప: ప్రొద్దుటూరు, పులివెందుల, జమ్మలమడుగు, బద్వేలు, రాయచోటి, మైదుకూరు, ఎర్రగుంట్ల

చిత్తూరు: మదనపల్లె, పుంగనూరు, పలమనేరు, నగరి, పుత్తూరు.