Begin typing your search above and press return to search.

ఏపీలో మ‌రో పోరు జ‌ర‌గ‌నుంది

By:  Tupaki Desk   |   3 March 2017 12:00 PM GMT
ఏపీలో మ‌రో పోరు జ‌ర‌గ‌నుంది
X
సుదీర్ఘ కాలంగా పెండింగ్‌ లో ఉన్న మున్సిపల్ - కార్పొరేషన్లకు ఎన్నికలు జూన్ నెలలో జరిపేందుకు రాష్ట్రప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. రాష్ట్రంలో ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటుగా పదోతరగతి - ఇంటర్ - డిగ్రీ పరీక్షలు పూర్తయిన వెంటనే ఈ పోరు ఉండ‌నుందని స‌మాచారం. అందులో భాగంగా మేనెలలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం నుండి సంకేతాలు అందినట్లు తెలుగుదేశం పార్టీవర్గాల సమాచారం. ఈ క్ర‌మంలో ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో తెలుగుతమ్ముళ్లు ఈపాటికే అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టిసారించారు.

ఆంధ్ర‌ప్రదేశ్‌ రాష్ట్రంలో ఎన్నికలు జరగకుండా కర్నూలు - తిరుపతి - శ్రీకాకుళం గ్రేటర్‌ విశాఖ - కాకినాడ - గుంటూరు - ఒంగోలు మున్సిపల్‌ కార్పోరేషన్లు ఉన్నాయి. రాజంపేట - రాజమండ్రి. నెల్లిమర్ల - కందుకూరు మున్సిపాలిటీలు ఇలాగే త‌మ పాల‌కు కోసం ఎదురుచూస్తున్నాయి. వీటిలో త్వరలో ముహుర్తుం ఖారారు కానుంది. బ‌డ్జెట్ స‌మావేశాల అనంత‌రం ఈ మేర‌కు ప్రభుత్వం క‌స‌ర‌త్తు ప్రారంభించనున్న‌ట్లు తెలుస్తోంది. పదోతరగతి - ఇంటర్ - డిగ్రీ పరీక్షలు పూర్తయిన వెంట‌నే కోర్టు తీర్పుతో సంబంధం లేని పుర‌పాలిక‌ల్లో ఎన్నిక‌లు నిర్వ‌హించ‌వ‌చ్చ‌ని చెప్తున్నారు. ఇందుకోసం ఇప్ప‌టికే ప్ర‌భుత్వ ప‌రంగా సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు తెలుస్తోంది. ఎన్నిక‌లు జ‌రిగే ప్రాంతాల్లో అభివృద్ధి ప‌నులు చేప‌ట్టి త‌ద్వారా ఓట్లు రాబ‌ట్టుకునేందుకు ప్ర‌భుత్వం ప్రణాళిక‌లు రెడీ చేసింద‌ని టీడీపీ నాయ‌కులు అంటున్నారు. స్థానికంలో గెలిచి టీడీపీ ప‌ట్టు నిలుపుకుంటామ‌ని వివ‌రిస్తున్నారు.

కాగా 2019 ఎన్నిక‌ల మూడ్ వ‌చ్చేసిన నేప‌థ్యంలో అధికార‌ - ప్ర‌తిప‌క్షాలు ఈ ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంటాయ‌నేది నిపుణుల మాట‌. త‌మ పాల‌న‌లో చేసిన అభివృద్ధికి రెఫ‌రెండంగా ఈ ఎన్నిక‌ల‌ను తెలుగుదేశం పార్టీ భావించ‌వ‌చ్చున‌ని అంటున్నారు. ఈ ఫ‌లితాల ఆధారంగా 2019 ఎన్నిక‌ల వ్యూహాన్ని టీడీపీ సిద్ధం చేసుకోవ‌చ్చున‌ని విశ్లేషిస్తున్నారు. ఇక ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన వైసీపీ సైతం విప‌క్షంగా త‌మ‌ను ప్ర‌జ‌ల ఎంత ద‌గ్గ‌ర చేసుకున్నార‌నేది తెలుసుకునేందుకు ఈ ఎన్నిక‌లు స‌రైన మార్గ‌మ‌ని అంటున్నారు. ఈ ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను బేరీజు వేసుకుంటే ప్ర‌తిప‌క్షానికి సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో విజ‌యం తేలిక అవుతుంద‌ని చెప్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/