Begin typing your search above and press return to search.

అతగాడి టికెట్ ను క్యాన్సిల్ చేసేశారు

By:  Tupaki Desk   |   28 March 2017 6:11 PM GMT
అతగాడి టికెట్ ను క్యాన్సిల్ చేసేశారు
X
అడిగిన టికెట్ ఇవ్వలేదన్న ఒకేఒక్క అక్కసుతో తనకంటే పెద్ద వయస్కుడ్ని పాతిక చెప్పుదెబ్బలు కొట్టినట్లుగా గర్వంగా చెప్పుకోవటమే కాదు.. సారీ చెప్పే ప్రసక్తే లేదని తెంపరితనంతో మాట్లాడిన శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ ను ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. సిగ్గుమాలిన పని చేసి కూడా.. ఇష్టారాజ్యంగా మాట్లాడటం ఈ బరితెగింపు ఎంపీకే సాధ్యం. ఆయనకు తగ్గట్లే విపరీతమైన మూర్ఖ.. మొండి పార్టీ అయిన శివసేన ఒత్తిడితో ఎయిరిండియా విధించిన నిషేదాన్ని ఎత్తివేస్తున్నట్లుగా ప్రకటన వెలువడింది.

విమానయాన శాఖ ఆయనపై వేసిన వేటును వెనక్కితీసుకున్నా.. ఎయిరిండియా ఉద్యోగులు మాత్రం ఆయనపై తీవ్రఆగ్రహంతో ఉన్న విషయం తాజా ఉదంతంతో స్పష్టమయ్యే పరిస్థితి. బుధవారం ఆయన ఢిల్లీకి వచ్చేందుకు ఎయిరిండియా టికెట్ ఒకటి బుక్ చేసుకున్నారు. అయితే.. ఆయన టికెట్ ను క్యాన్సిల్ చేస్తూ ఎయిరిండియా ప్రకటించింది.

అంతేకాదు.. ఆయన పేరిట టికెట్ బుకింగ్ ను నిలిపివేయాలంటూ ముంబయి విమానయాన సిబ్బంది ఆన్ లైన్ సేవా ప్రతినిధులకు సమాచారాన్ని అందించారు. అంతేకాదు..ఆపరేటర్లద్వారా కూడా గైక్వాడ్ పేరుమీద ఎలాంటి బుకింగ్ లను చేయొద్దంటూ ప్రత్యేక నోట్ ను పంపినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా చూస్తే.. దుడుకు ఎంపీ యవ్వారాన్ని తమకున్న బలంతో ఒక చూపు చూసేందుకు ఎయిరిండియా సిబ్బంది సిద్ధంగా ఉన్నట్లుగా చెప్పక తప్పదు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/