Begin typing your search above and press return to search.

డ్యామ్ ను పీత‌లు తినేశాయ‌ట‌..మ‌హా స‌ర్కారుకు మూడిందా?

By:  Tupaki Desk   |   7 July 2019 10:09 AM GMT
డ్యామ్ ను పీత‌లు తినేశాయ‌ట‌..మ‌హా స‌ర్కారుకు మూడిందా?
X
కొన్నిసార్లు అంతే.. ఎంత క‌వ‌ర్ చేసినా క‌వ‌ర్ కావు. ఇటీవ‌ల ముంబ‌యి మ‌హాన‌గ‌రంలో కురిసిన వ‌ర్షం కార‌ణంగా పెద్ద సంఖ్య‌లో సామాన్యులు మృత్యువాత ప‌డ‌టంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ఫ‌డ్న‌వీస్ లాంటి స‌మ‌ర్థ ముఖ్య‌మంత్రి పాల‌న‌లోనూ ఇలాంటి దారుణ ప‌రిస్థితి ఏర్ప‌డ‌ట‌మా? అన్న ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి.

ఇదిలా ఉండ‌గా.. మ‌హారాష్ట్ర ర‌త్న‌గిరి జిల్లాలో తివారీ డ్యామ్ కు గండి ప‌డ‌టంతో 23 మందికి పైగా మ‌ర‌ణించారు. ప‌లువురి ఆచూకీ ల‌భించ‌ని ప‌రిస్థితి. ఈ ప్ర‌మాదంపై రాష్ట్ర మంత్రి తానాజీ సావంత్ చేసిన వ్యాఖ్య‌లు మంట పుట్టేలా ఉన్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. డ్యామ్ గోడ‌ల్ని పీత‌లు తిన్న కార‌ణంగా అవి బ‌ల‌హీన‌ప‌డ్డాయ‌ని.. ఆ కార‌ణంతోనే గండి ప‌డిందంటూ అత‌గాడు చెబుతున్న కారణంపై ప‌లువురు మండిప‌డుతున్నారు.

డ్యామ్ కు గండిప‌డ‌టంపై ఇప్ప‌టికే ముఖ్య‌మంత్రి ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందాన్ని నియ‌మించార‌ని.. నివేదిక వ‌చ్చాక పూర్తి వివ‌రాలుతెలుస్తాయ‌ని చెప్పారు. అలాంటిదే ఉన్న‌ప్పుడు బాధ్య‌తారాహిత్యంతో పీత‌ల ప్ర‌స్తావ‌న ఎందుక‌న్న ప్ర‌శ్న తలెత్తుతోంది. మంత్రి సావంత్ చేసిన పీత‌ల వ్యాఖ్య‌ల‌పై ఎన్సీపీ నేత‌లు తీవ్రంగా మండిప‌డుతున్నారు.

డ్యామ్ గండిప‌డ‌టానికి కార‌ణ‌మైన పీత‌ల మీద కేసులు పెట్టాల‌ని.. అరెస్ట్ చేయాల‌ని వారు డిమాండ్ చేస్తున్నారు. ప‌నిలో ప‌నిగా కొన్ని పీత‌ల్ని తీసుకొచ్చి.. పోలీసుల చేతికి ఇచ్చి వాటిని అరెస్ట్ చేయాలంటున్నారు. రాష్ట్ర మంత్రి హోదాలో డ్యామ్ గండికి కార‌ణం పీత‌లంటూ చేస్తున్న బాధ్య‌తారాహిత్య‌మైన వ్యాఖ్య‌ల్ని ఖండించ‌ట‌మే కాదు.. అలాంటి వాటిని ఆదిలోనే క‌ట్ట‌డి చేయాల్సిన ఫ‌డ్న‌వీస్ మౌనంగా ఎందుకు ఉంటున్నార‌న్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. వ‌రుస వైఫ‌ల్యాల్ని చూస్తుంటే.. త్వ‌ర‌లో జ‌రిగే ఎన్నిక‌ల్లో ఫ‌డ్న‌వీస్ స‌ర్కారుకు మూడిందా? అన్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం. ఎన్నిక‌లు ముంచుకొస్తున్న వేళ‌.. ఫ‌డ్న‌వీస్ మ‌రింత చురుగ్గా వ్య‌వ‌హ‌రించాల్సిన అవ‌స‌రం ఉంది. లేకుంటే.. ఎదురుదెబ్బ ఖాయ‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.